
ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. మండలాలు, నియోజకవర్గాల వారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఖమ్మం సభ నిర్వహణ బాధ్యతలను మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు, మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డికి అప్పగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే 3 లక్షలకుపై జనసమీకరణ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సభకు నల్గొండ, మహబూబాబాద్తో పాటు ఏపీ బార్డర్ ప్రజలు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇక నాలుగు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం పంపారు. మరో ఇద్దరు మాజీ సీఎంలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. భారీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని నేతలకు సీఎం సూచించారు. బీఆర్ఎస్ ఎజెండా, పలు విధివిధానాల పై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత మొట్ట మొదటి సారిగా ఖమ్మంలో ఈ నెల 18 వ తేదీన భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు ఖమ్మం జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర కీలక నేతలు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో సమావేశమైన ఖమ్మం జిల్లా నేతలు బహిరంగ సభను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేసేందుకు సంబంధించి చర్చించారు. తెలంగాణలో జరగనున్న మొట్టమొదటి బీఆర్ఎస్ సభను విజయవంతం చేసేందుకు సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా నేతలకు పలు సూచనలు చేశారు.