కేసీఆర్​ అవినీతి  అందరికీ తెలుసు

కేసీఆర్​ అవినీతి  అందరికీ తెలుసు
  • తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్తలేవ్​
  • రాష్ట్రంలో ప్రతి గడపకూ వెళ్తం
  • అధికారంలోకి వస్తే ఫ్రీగా విద్య, వైద్యం
  • ఆప్​ ఎమ్మెల్యే, సౌత్​ ఇండియా ఇన్​చార్జ్​ సోమ్​నాథ్​ భారతి

హైదరాబాద్/హనుమకొండ, వెలుగు: తెలంగాణలో కేసీఆర్ అవినీతి గురించి చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారని ఆమ్​ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, సౌత్ ఇండియా ఇన్​చార్జ్​ సోమనాథ్​ భారతి అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడం లేదని పేర్కొన్నారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం వల్ల రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. తెలంగాణలోనూ ఆప్​ సత్తా చాటుతుందని, తాము అధికారంలోకి వస్తే ప్రజలకే అధికారం దక్కుతుందని, విద్య,  వైద్యం ఫ్రీగా అందుతాయని తెలిపారు. ఆదివారం హనుమకొండలో ఆయన పర్యటించారు. హైదరాబాద్ టూరిజం ప్లాజాలో  మీడియాతో మాట్లాడారు. లక్షా 92 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా సీఎం కేసీఆర్ భర్తీ చేయట్లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి గడపకూ వెళ్తామని, ఏప్రిల్ 14న పాదయాత్ర చేపడుతామని చెప్పారు. కేజ్రీవాల్ మోడల్ గవర్నెన్స్ ను ప్రజల ముందుకు తీసుకెళ్తామని, అవినీతి రహిత పాలన అందించటమే ఆప్ లక్ష్యమన్నారు. 

అట్లయితే విజయం సాధించదు..
మోడీని ఓడించాలనే లక్ష్యంతో కూటమి ఏర్పడితే అది విజయం సాధించదని, సమస్యలపై కూటమి ఏర్పడితేనే విజయం సాధిస్తుందని సోమ్​నాథ్​ భారతి అన్నారు. అలాంటి కూటమి వస్తే అప్పుడు కూటమిలో చేరడంపై ఆలోచిస్తామని చెప్పారు.  ప్రొఫెసర్ కోదండరాంను ఆప్ లో చేరాలని గతంలో అడిగామని, ఆయన అంగీకరించలేదని తెలిపారు. 
ఆదివారం కాజీపేట నుంచి హనుమకొండ అదాలత్​​ సెంటర్​ వరకు ఆప్​ ఆధ్వర్యంలో నిర్వహించిన పంజాబ్​ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో  సోమ్​నాథ్​ పాల్గొన్నారు. అనంతరం పార్టీ హనుమకొండ జిల్లా ఆఫీస్​ను ఆయన  ప్రారంభించారు. కాళోజీని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో ఆమ్​ ఆద్మీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామని పార్టీ సెర్చ్​ కమిటీ  చైర్​ పర్సన్​ ఇందిరా శోభన్ అన్నారు.