ఆమ్దానీ ఎంత..అవసరమెంత?..బడ్జెట్​పై సీఎం రివ్యూలు

ఆమ్దానీ ఎంత..అవసరమెంత?..బడ్జెట్​పై సీఎం రివ్యూలు

హైదరాబాద్, వెలుగువచ్చే నెల మొదటివారం లేదా రెండో వారంలో రాష్ట్ర బడ్జెట్ ​ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్​ రివ్యూలు చేపడుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు సమీక్షించిన ఆయన గురువారం చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీతో రివ్యూ నిర్వహించారు. కేంద్ర బడ్జెట్​ ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధులు ఎన్ని? ఆమ్దానీ ఎంత? ఏ ఏ శాఖకు ఎంతెంత నిధులు కేటాయించాలి? ప్రతిపాదనలు ఏమిటి?.. అనేది ఆరా తీస్తున్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్సీ అమలు వంటి అంశాలపై చర్చిస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగులకు ప్రస్తుత బేసిక్ శాలరీపై 7.5 శాతం ఫిట్​మెంట్​ ఇవ్వాలని పీఆర్సీ కమిషన్  రికమెండ్ చేసింది. ఎంత ఫిట్​మెంట్​ ఇవ్వాలి? ఎంతిస్తే ఎంత భారం పడుతుందని సీఎం ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ మధ్య మంత్రి కేటీఆర్.. త్వరలో నిరుద్యోగ భృతి అమలుపై కేసీఆర్ ప్రకటన చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని, వీరికి ప్రతి నెల 3,016 ఇవ్వడం వల్ల ఏడాదికి రూ. 3,600 కోట్లు అవసరమవుతాయని ఆఫీసర్లు
చెప్తున్నారు.

ఇరిగేషన్‌‌ బడ్జెట్‌‌పై నేడు  రివ్యూ

ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ బడ్జెట్‌‌పై శుక్రవారం సీఎం కేసీఆర్‌‌ సమీక్షించనున్నారు. ప్రాజెక్టులు, చీఫ్‌‌ ఇంజనీర్ల వారీగా చేపట్టాల్సిన పనులు,  వాటికి చేయాల్సిన కేటాయింపులపై చర్చించనున్నారు. 2021–-22లో రూ.32 వేల కోట్ల అంచనాలతో ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ బడ్జెట్‌‌ అంచనాలు రూపొందించింది. వాటిలో ముఖ్యమైన పనులు ఏవీ? వెంటనే  చేపట్టాల్సినవి ఏవీ?తదితర అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. కాగా, ఆర్టీసీ ఉద్యోగుల భద్రత గైడ్ లైన్స్ పై సీఎం కేసీఆర్ సంతకం పెట్టడంపై రవాణా మంత్రి పువ్వాడ అజయ్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం సీఎంకు ఓ ప్రకటనలో థ్యాంక్స్ చెప్పారు.