కేసీఆర్​ లిక్కర్​ ఆమ్దానీతో రాష్ట్రాన్ని నడుపుతున్నడు : డీకే అరుణ

కేసీఆర్​ లిక్కర్​ ఆమ్దానీతో రాష్ట్రాన్ని నడుపుతున్నడు : డీకే అరుణ

గద్వాల, వెలుగు: మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కల్వకుంట్ల ఫ్యామిలీ లూటీ చేసి అప్పుల తెలంగాణగా మార్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో వేల కోట్లు దండుకుందన్నారు. ‘ప్రజా గోస – బీజేపీ భరోసా యాత్ర’లో భాగంగా మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం కొండాపురం, ఇర్కిచేడు, ఇర్కిచేడు తండా, ముసల్ దొడ్డి, పాగుంట, వెంకటాపురం గ్రామాల్లో అరుణ పర్యటించారు. బీజేపీ జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధిలో దేవుడెరుగు.. తెలంగాణను లిక్కర్ ఆమ్దానీలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ ది అన్నారు.

ప్రజలను తాగుబోతులను చేశారని, మద్యానికి బానిసలై అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో లిక్కర్​పై వచ్చే ఆదాయం 10 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు 40 వేల కోట్లు ఉందని, దాంతోనే కేసీఆర్​రాష్ట్రాన్ని నడిపే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందన్నారు. మాయమాటలతో ఓట్లు దండుకొని, ప్రజల రక్తాన్ని తాగుతున్నారని విమర్శించారు. బీజేపీతోనే  అభివృద్ధి సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో తమకు పట్టం కట్టాలని అరుణ పిలుపునిచ్చారు. ఆమె వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులు మీర్జాపురం రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మహానంది రెడ్డి, తిమ్మారెడ్డి, శివరాజప్ప, బండ వెంకటరాములు, కుమ్మరి శ్రీనివాసులు, కబీర్దాసు నరసింహులు, రజక నరసింహులు ఉన్నారు.