ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై సైలెంట్.. 5 నెలలుగా పట్టించుకోని కేసీఆర్ 

ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై సైలెంట్.. 5 నెలలుగా పట్టించుకోని కేసీఆర్ 

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్​లో బీఆర్ఎస్​విస్తరణను ఆ పార్టీ చీఫ్ కేసీఆర్​ లైట్ తీసుకుంటున్నారా? ఐదు నెలలుగా అక్కడ పార్టీ వ్యవహారాల విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నా రా? అంటే.. గులాబీ నేతలు అవుననే చెప్తున్నారు. టీఆర్ఎస్​ పేరును బీఆర్ఎస్​గా మార్చిన తర్వా త మొదటగా ఏపీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నియ మించారు. మొదట్లో ఆ రాష్ట్రం నుంచి నేతల చేరి కల పేరుతో హడావుడి చేశారు. జనవరి18న ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ తర్వాత ఏపీపైనే ఫోకస్​అని చెప్పారు. పది, పదిహేను రోజుల్లోనే విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ పెడుతున్నట్టు లీకులు ఇచ్చారు. విశాఖతో పాటు విజయవాడ, కర్నూల్, తిరుపతిలోనూ సభలు నిర్వ హించి ఏపీలో బీఆర్ఎస్​ సత్తా చాటుతుందని చెప్పుకొచ్చారు. విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులకు అండగా నిలిచేందుకు అక్కడ కేసీఆర్​సభ పెడతారని చెప్పారు. కానీ ఇవేవీ జరగలేదు. కేసీఆర్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కొన్ని నెలలుగా ఏపీలో బీఆర్ఎస్​ యాక్టివిటీ చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు.  

ఉత్తరాదివైపే కేసీఆర్ చూపు? 

మహారాష్ట్ర తర్వాత పార్టీ విస్తరణ కోసం మధ్యప్రదేశ్, గుజరాత్​లకు వెళ్లబోతున్నట్టు నాందేడ్​లో కేసీఆర్​ ప్రకటించారు. పార్టీ పేరు మార్చిన తర్వాత జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నా జేడీఎస్​కు రహస్యంగా సపోర్ట్​చేశారు. ఏపీలో విస్తరణకు ముందడుగు వేసి, తర్వాత వెనక్కి తగ్గారు. తర్వాతి డెస్టినేషన్​ మధ్యప్రదేశ్, గుజరాత్​ అని చెప్పి.. దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాల గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కేసీఆర్​ ఉత్తరాదిలోనే పార్టీ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నారా? రైతు ఉద్యమం బలంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే పార్టీకి కొద్దోగొప్పో ఆదరణ లభిస్తుందనే అంచనాకు వచ్చారా? అనే ప్రశ్నలకు పార్టీ ముఖ్యుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం జగన్​తో కేసీఆర్​ దోస్తీ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్, కర్నాటక మాజీ సీఎం కుమారస్వామితోనూ దోస్తానా ఉంది. కేరళ వైపు అడుగులు వేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్​సహా వామపక్ష నేతలను కలిసినా అది రాజకీయ మైత్రి దిశగా చేసిన ప్రయత్నమే. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే మిగతా రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై కేసీఆర్​దృష్టి సారించే అవకాశముందని, అప్పటివరకు 
ఏపీ సహా మిగతా రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలు పెద్దగా ఉండబోవని ప్రగతి భవన్​తో సన్నిహిత సంబంధాలున్న నేత ఒకరు చెప్పారు.

పార్టీ నేతల్లో అయోమయం 

గుంటూరులో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్​ ​ప్రారంభించారు. ఈ ప్రోగ్రామ్​ను కేసీఆర్​ లైట్​గా తీసుకున్నారు. బీఆర్ఎస్​ ఏపీ అధ్యక్షుడు చంద్రశేఖర్​తో పాటు మరికొందరు లీడర్లు పాల్గొన్నారు. ఏపీ తర్వాతనే మహారాష్ట్ర పాలిటిక్స్ పై కేసీఆర్ దృష్టి సారించారు. నాందేడ్, లోహ, ఔరంగాబాద్ ​సభల్లో పాల్గొన్నారు. నాందేడ్​లో లీడర్లు, కార్యకర్తల శిక్షణ శిబిరానికి ప్రత్యేక విమానంలో వెళ్లొచ్చారు. మహారాష్ట్రకు 4సార్లు వెళ్లిన కేసీఆర్ ​నాందేడ్, ఔరంగాబాద్​లలో పార్టీకి పర్మనెంట్ ఆఫీస్​ల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఫ్లయిట్​జర్నీ చేస్తేగానీ గంటల్లో రీచ్​కాలేని మహారాష్ట్రకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్న కేసీఆర్.. హెలికాప్టర్​లో కొన్ని గంటల్లోనే వెళ్లగలిగే గుంటూరుకు ఎందుకు వెళ్లలేదనే చర్చ పార్టీలోనే సాగుతోంది. కేసీఆర్​కు ఏపీలో ఎంతోమంది నేతలు స్నేహితులని, సులువుగా బీఆర్ఎస్​కు ఆదరణ లభిస్తుందని చెప్పిన లీడర్లే గులాబీ బాస్ ​ఎందుకిలా చేస్తున్నారని మదనపడుతున్నారు.