మైండ్‌స్పేస్ – ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమిపూజ

మైండ్‌స్పేస్ – ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమిపూజ

హైదరాబాద్ : మైండ్‌స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎక్స్ప్రెస్ మెట్రోకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

రూ. 6,250 కోట్ల అంచనాతో.. 

ఐటీ హబ్ మైండ్ స్పేస్ ( రాయదుర్గం మెట్రో స్టేషన్) నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 31 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో లైన్ను ప్రభుత్వం నిర్మించనుంది. మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి, నానక్ రాంగూడ జంక్షన్ల నుంచి ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు కొత్త మెట్రో రైలు నడవనుంది. మొత్తం 31 కిలోమీట‌ర్ల మేర నిర్మించే ఎక్స్ ప్రెస్ మెట్రోకు  రూ. 6,250 కోట్ల వ్యయం  అవుతుందని  రాష్ట్ర ప్రభుత్వం  అంచనా వేసింది. ఈ  మెట్రో ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించనుంది. 

ఎలా వెళ్తుంది..?

మైండ్ స్పేస్ చౌరస్తా  నుంచి 0.9 దూరంలో రాయదుర్గం దగ్గర ఎయిర్‌పోర్టు స్టేషన్‌ నిర్మించనున్నారు. అక్కడి నుంచి ఎయిర్‌పోర్టు మెట్రో మొదలవుతుంది. అటు నుంచి బయోడైవర్సిటీ చౌరస్తాలో రెండు ఫ్లైఓవర్లను దాటేసి ..  ఖాజాగూడ చెరువు దగ్గర  నుంచి మెట్రో పయనిస్తుంది.  ఖాజాగూడ వద్ద కుడి వైపునకు తిరిగి.. నానక్‌రామ్‌గూడ జంక్షన్‌ను చేరుకోనుంది. అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పక్క నుంచి నార్సింగి, అప్పా జంక్షన్, రాజేంద్రనగర్, శంషాబాద్, ఎయిర్‌పోర్టు కార్గో మీదుగా.. ఎయిర్‌పోర్టులోకి చేరుకుంటుంది. మొత్తం ఈ మార్గంలో 9 స్టేషన్‌లు ఉండనున్నాయి. ఆయా ప్రాంతాల్లో స్కైవాకర్స్ నిర్మించనున్నారు.

అండర్ గ్రౌండ్ నుంచి మెట్రో పయనం..

మరోవైపు ఇప్పటి వరకు హైదరాబాద్ లో పరుగులు పెడుతున్న మెట్రో రైల్..ఆకాశ మార్గంలో మాత్రమే పయనిస్తోంది. అయితే తాజాగా ఎక్స్ ప్రెస్ మెట్రో తొలిసారిగా అండర్ గ్రౌండ్ లో నడవనుంది. ఇందుకోసం శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో భూగర్భ మార్గాన్ని నిర్మించనున్నారు. మొత్తం 31 కిలో మీటర్ల మార్గంలో.. 27.5 కిలో మీటర్లు ఆకాశమార్గంలో ఉంటుంది. అయితే 1 కిలో మీటర్ భూమార్గంలో అంటే.. రోడ్డు లెవెల్‌లో వెళ్తుంది.  మరో 2.5 కిలో మీటర్లు మాత్రం అండర్ గ్రౌండ్‌లో ఉండనుంది. మొత్తంగా ఎయిర్ పోర్టు మెట్రో పూర్తయితే.... రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు 31 కిలో మీటర్ల  దూరాన్ని 26 నిమిషాల్లోనే  చేరుకోవచ్చు.