భద్రాచలానికి రోడ్డు మార్గాన బయలు దేరిన సీఎం కేసీఆర్

భద్రాచలానికి రోడ్డు మార్గాన బయలు దేరిన సీఎం కేసీఆర్

భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కానీ.. వాతావరణం అనుకూలించని కారణంగా సీఎం ఏరియల్ సర్వే రద్దు అయ్యింది. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి హన్మకొండ నుండి భద్రాచలానికి రోడ్డు మార్గాన బయలు దేరారు. హనుమకొండ నుండి రోడ్డు మార్గంలో ములుగు జిల్లా ఏటూరు నాగారానికి వెళుతున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు హరీష్ రావు, దయాకరరావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు నరేందర్, గండ్ర వెంకట రమణ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, సీఎంఓ స్మిత సబర్వాల్, కడియం శ్రీహరి, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులున్నారు.

వరద పరిస్థితిని సమీక్షించేందుకు శనివారమే వరంగల్ కు చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించనున్నారు. రెండ్రోజుల పాటు ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే కొనసాగనుంది. ఆదివారం ఉదయం 7 గంటలకు సీఎం కేసీఆర్ వరంగల్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరాల్సి ఉంది. కానీ.. వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన బయలుదేరారు. భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అనంతరం వరద పరిస్థితి, సహాయ, పునరావాస కార్యక్రమాలపై అక్కడి అధికారులతో చర్చించనున్నారు. అనంతరం భద్రాచలం నుంచి బయలు దేరి ఏటూరు నాగారం, ములుగు మండలాల్లో పరిస్థితిని సమీక్షించనున్నారు. బేగంపేటకు చేరుకున్న అనంతరం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆదివారం హైదరాబాద్ లోనే బస చేసి.. సోమవారం తిరిగి గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితి గురించి ఆరా తీయనున్నారు.