కేంద్రం దిగొచ్చే వరకూ పోరాటం: ధర్నా చౌక్‌లో కేసీఆర్‌

కేంద్రం దిగొచ్చే వరకూ పోరాటం: ధర్నా చౌక్‌లో కేసీఆర్‌

హైదరాబాద్‌: రైతుల బాధను దేశం మొత్తం తెలిసేలా చేసేందుకు తాను మహా ధర్నాకు కూర్చున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందిరా పార్కులోని ధర్నా చౌక్‌లో ఈ రోజు ఉదయం సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి సహా ప్రభుత్వ పెద్దలు, టీఆర్‌‌ఎస్ నేతలు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్‌‌ మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ విధానాలను పాటిస్తోందన్నారు. పంజాబ్‌లో వడ్లు కొన్న తీరుగానే తెలంగాణలోనూ కొనాలని తాము డిమాండ్ చేశామని, ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని ఢిల్లీకి పోయి అడిగినా కేంద్రం స్పందించలేదని చెప్పారు. ఈ తీరును నిరసిస్తూ ఈ రోజు మహాధర్నా చేపట్టామన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతున్నారని, వారికి న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని అన్నారు.  

కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని యుద్ధం మొదలుపెట్టామని, ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదని సీఎం కేసీఆర్‌‌ స్పష్టం చేశారు. రైతుల బాధ దేశం మొత్తానికి తెలియాలని ఈ మహాధర్నా చేస్తున్నామని అన్నారు. కేంద్రం దిగి వచ్చి రైతులకు న్యాయం చేసేవరకూ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో మొదలైన ఈ పోరాటం ఢిల్లీ పెద్దలకు తెలిసొచ్చి.. రైతులకు న్యాయం జరిగే వరకూ ఆగదని అన్నారు.

సీఎం ధర్నాకు కూర్చునే దిక్కుమాలిన పరిస్థితి తీసుకొచ్చారు

హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ యుద్ధం ఇక్కడితో ఆగదని, అవసరమైతే ఢిల్లీ వరకు యాత్ర చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ప్రభుత్వాలు ధర్నాలు చేయడం కొత్తేమీ కాదని, 2006లో ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉండి మోడీ 51 గంటలు ధర్నా చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రులు-, మంత్రులు ధర్నాలు చేయకుండా పాలన చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. పనేం లేక తాము ధర్నాలు చేయండం లేదని, రైతులు ఆందోళనలో ఉన్నారు కాబట్టే తాము ధర్నాకు దిగాల్సి వచ్చిందని కేసీఆర్ చెప్పారు. కేంద్రం రైతుల పట్ల వ్యతిరేకతతో ఉందని, సీఎం ధర్నాకు కూర్చునే దిక్కుమాలిన పరిస్థితి తీసుకొచ్చారని, కేంద్రం దిగొచ్చి రాష్ట్రంలోని రైతుల పండించిన ధాన్యం అంతా కొనుగోలు చేసే వరకూ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.