
హైదరాబాద్, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచ్‌లపై వేటు తప్పదని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఊళ్లలో హరితహారం, ఇతర అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులిస్తామని, అదే సందర్భంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై శనివారం ప్రగతిభవన్‌లో చర్చించిన సీఎం.. ఈ సందర్భంగా సర్పంచ్ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. వారితో కలిసి లంచ్ చేశారు. ఉప సర్పంచ్‌లకు ఇచ్చిన చెక్ పవర్ రద్దు చేయాలని, ఎస్సీ, ఎస్టీలు, మహిళలు సర్పంచ్‌లుగా ఉన్నచోట ఉపసర్పంచ్‌లే పూర్తి స్థాయిలో పెత్తనం చేసే పరిస్థితి నెలకొందని, నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాజుపల్లిలో ఇలాగే సర్పంచ్ సీట్లో ఉప సర్పంచ్ కూర్చున్నాడని సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఉపసర్పంచ్‌కు చెక్ పవర్ ఇవ్వడంతో వార్డు సభ్యులు ఏకమై ఉప సర్పంచ్ మీద రెండున్నరేండ్ల తర్వాత అవిశ్వాసం పెట్టే ప్రమాదముందని, దీంతో స్థానికంగా లొల్లులు జరగొచ్చని వివరించారు. పదవి నుంచి తొలగించడంపై పునరాలోచించాలని,- 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు దక్కిన 29 అధికారాలను బదలాయించాలని, కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం లక్ష్యాలను చేరుకునేందుకు నిధులు విడుదల చేయాలని ఆయనను కోరినట్లు తెలిసింది. వారి విజ్ఞప్తిపై స్పందించిన సీఎం కేసీఆర్.. పదవి నుంచి తొలగించే విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. జాయింట్ చెక్‌పవర్‌పై సర్పంచ్‌లు సంయమనం పాటించాలని, ఈ విషయంలో తల్తెత్తుతున్న సమస్యలను తెలుసుకుంటామని సీఎం చెప్పినట్లు తెలిసింది. సర్పంచ్‌లకు 29 అధికారాలను బదలాయిస్తూ త్వరలో ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. గతంలో మాదిరి పంచాయతీ నిధులపై ఫ్రీజింగ్‌ను విధించబోమని, ప్రస్తుత ఫ్రీజింగ్‌ను త్వరలోనే ఎత్తివేస్తామని కూడా సీఎం హామీ ఇచ్చినట్లు సర్పంచ్‌ల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు.