- ఢిల్లీలోనే సీఎం, సీఎస్, ఉన్నతాధికారులు
- మునుగోడు, జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చర్చలు
- బయటకేమో అప్పులపై సమీక్షలంటూ లీకులు
- క్యాట్ కేసు కోసం అక్కడే మకాం వేసిన సోమేశ్ కుమార్
- వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం.. ఇబ్బందుల్లో జనం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలు, వరదలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు వేరే పనుల్లో బిజీ అయిపోయారు. సీఎం, సీఎస్ సహా మరికొందరు ఉన్నతాధికారులు ఢిల్లీలో మకాం వేశారు. దీంతో సెక్రటేరియట్ లో ఐఏఎస్ ల చాంబర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వర్షాలు, వరదల వల్ల తాము రోడ్డున పడ్డామని.. మంత్రులు, అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయం కోసం వరద బాధితులు ఎదురుచూస్తుండగా, పంట నష్టపోయి రైతులు లబోదిబోమంటున్నారు. మరోవైపు సీజనల్ వ్యాధులు విజృంభించి సర్కార్ దవాఖాన్లకు జనం పరుగులు పెడుతున్నరు. అక్కడ కనీస సౌలతులు లేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలన్నింటిపై ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేయాల్సిన సీఎస్.. కేవలం ఒక్క రోజు టెలీకాన్ఫరెన్స్ పెట్టి వదిలేశారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కు ఎందుకు వెళ్లారో అధికారికంగా వెల్లడించలేదు. ఆయన అక్కడ అప్పులపై అధికారులతో రివ్యూ చేస్తున్నట్లు రోజుకో లీక్ ఇస్తున్నారు. అయితే అప్పులపై అధికారులతో రివ్యూ చేసేందుకు ఢిల్లీకి ఎందుకు? అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజానికి కేసీఆర్ అక్కడ మునుగోడు, జాతీయ రాజకీయాలపై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేస్తారు? మునుగోడుకు ఉప ఎన్నిక ఎప్పుడొచ్చే చాన్స్ ఉంది? వస్తే ఎలా ముందుకెళ్లాలి? ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎలాంటి వరాలు ఇవ్వాలి? ఇప్పటికిప్పుడు మునుగోడులో ఏయే పనులు చేయగలం? తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు యాంటీ బీజేపీ లీడర్లతో వర్క్ షాప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక మంత్రులు కూడా వారి సొంత పనుల్లో బిజీ అయిపోయారు. మంత్రి కేటీఆర్ కాలుకి ఫ్రాక్చర్ అయి ఇంటికే పరిమితమయ్యారు. ఓటీటీలో ఏ సినిమాలు చూడాలో చెప్పడంటూ ఆయన చేసిన ట్వీట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
సీఎస్ సహా ఐదుగురు...
ఐదు రోజుల కింద కేసీఆర్ తో కలిసి సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ఢిల్లీ వెళ్లారు. సెంట్రల్ అడ్మినిస్ర్టేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లో ఉన్న కేసు విషయంలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన టైమ్ లో సోమేశ్ ఏపీకి అలాట్ అయ్యారు. దీనిపై ఆయన క్యాట్ కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ కేసు తీర్పు రిజర్వ్ లో ఉంది. కాగా, స్పెషల్ సీఎస్ లు రామకృష్ణారావు, రజత్ కుమార్, సునీల్ శర్మ, రోనాల్డ్ రాస్ కూడా ఢిల్లీకి వెళ్లగా.. సునీల్ శర్మ ఒక్కరే తిరిగి వచ్చారు. మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ కూడా సెక్రటేరియేట్ కు రావడం లేదు.
ప్రజల సమస్యలు పట్టించుకునేదెవరు?
సీఎం, సీఎస్ సహా ఉన్నతాధికారులంతా ఢిల్లీలోనే ఉండడంతో రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వరద ప్రభావిత జిల్లాల్లో బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించలేదు. రూ.10 వేల సాయానికి నిధులు విడుదల చేయలేదు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని చెప్పడమే తప్ప.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వరదలతో పంటలు పాడైపోయినా నష్టం అంచనా వేయడం లేదు. వీఆర్ వోలకు సర్దుబాటుకు సంబంధించి ఏవేవో సూచనలు చేసి సీఎస్ ఢిల్లీ వెళ్లారని.. ఏం చేయాలో తమకు అర్థం కావడం లేదని ఆఫీసర్లు అంటున్నారు. ఇక కల్యాణ లక్ష్మీ, రైతు బీమా, పింఛన్లు తదితరాల కోసం జనం ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు.
కేసీఆర్తో అఖిలేశ్ భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్తో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భేటీ అయ్యారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్లోని సీఎం అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. అఖిలేశ్ వెంట ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ ఉన్నారు. దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణ, యూపీతో పాటు దేశ రాజకీయాలపై చర్చ జరిగినట్టు సమాచారం. పరస్పర సహకారంతో రెండు పార్టీలను, రెండు రాష్ట్రాల్లో విస్తరించే అంశంపై చర్చించినట్టు తెలిసింది. అంతకు ముందు అఖిలేశ్ ను కేసీఆర్ సన్మానించారు. తర్వాత కేసీఆర్, అఖిలేశ్, రాంగోపాల్ యాదవ్, వినోద్ కుమార్ కలిసి లంచ్ చేశారు.
