ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే : కేసీఆర్

ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే : కేసీఆర్

ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అనేది భార‌త రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్) నినాదమని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పార్టీ మారడంతో తెలంగాణ భవన్ లో ఆవిర్భావ వేడుక‌లు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో జెండాను ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. 

ఈ నెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్ భవనాన్ని ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్  చెప్పారు. త్వరలోనే  పార్టీకి సంబంధించిన జాతీయ పాలసీలు రూపొందిస్తామని తెలిపారు. దేశ పరివర్తన కోసమే బీఆర్ఎస్ ఏర్పడిందన్న కేసీఆర్... కర్ణాటకలో బీఆర్ఎస్ త‌ర‌పున ప్రచారం నిర్వహిస్తామన్నారు. క‌ర్ణాట‌కకు కుమారస్వామి సీఎం కావాలని ఆకాంక్షించారు. 

ఎన్నిక‌ల్లో గెలవాల్సింది రాజ‌కీయ పార్టీలు కాద‌ని ప్రజలు గెలవాలని కేసీఆర్ అన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. మహిళా సాధికారత కోసం కొత్త జాతీయ విధానం తీసుకొస్తామని తెలిపారు. ఇకపై రాష్ట్రాల మధ్య జల యద్దాలు ఉండవన్నారు. ప్రస్తుతం దేశం తప్పుడు విధానాలతో అల్లాడిపోతోందని చెప్పారు. 

తన ప్రతి ప్రస్థానంలో అవహేళనలు సర్వసాధారణమని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని  కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సమయంలోనూ  చాలామంది చాలా రకాలుగా ఎన్నో విమర్శలు చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి రాష్టాన్ని సాధించామని చెప్పారు.