గల్ఫ్‌లో సముద్రాన్ని వడపోస్తున్నారు.. మనం నీళ్లు ఎత్తిపోస్తే తప్పేంటి..?

గల్ఫ్‌లో సముద్రాన్ని వడపోస్తున్నారు.. మనం నీళ్లు ఎత్తిపోస్తే తప్పేంటి..?

రూ.10వేల కోట్లు కాదు.. రూ.15వేల కోట్ల కరెంట్ బిల్లులైనా కడతాం

అసెంబ్లీలో సీఎం కేసీఆర్

కాళేశ్వరం సహా ప్రాజెక్టుల కరెంట్ బిల్లులపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. దేశం, రాష్ట్రాలు వాటి ప్రాధాన్యతల క్రమంలో పనులు చేసుకుంటూ వెళ్లిపోతుంటాయన్నారు. “మన భౌగోలిక పరిస్థితి అందరికీ తెలుసు. కృష్ణా గోదావరి రెండే మనకు ఆధారం. కర్ణాటకలో 100 టీఎంసీలకు పర్మిషన్ ఇవ్వడంతో కృష్ణా నది జలాలను నమ్ముకునే పరిస్థితి లేదు. ఉన్నదొక్కటే గోదావరి. అది కూడా ఎగువ గోదావరి కూడా కాదు. ప్రాణహిత కలిసిన తర్వాత వచ్చే గోదావరి. నీళ్లు లేకపోతే బతుకే లేదు.. ఎంత ఖర్చవుతుందన్నది అర్థం పర్థం లేని వాదన” అన్నారు.

“గల్ఫ్ కంట్రీస్ లో సముద్రం నీళ్లు శుద్ధిచేసి వాడుకుంటారు. గల్ఫ్ లో వాళ్లకు టాప్ ప్రయారిటీ కాబట్టి.. ఖర్చు పెట్టైనా సరే ఆ దేశానికి  నీళ్లు సప్లై చేస్తున్నారు. అది వారి అవసరం. చెన్నైలో డీశాలినేషన్ ప్రాజెక్ట్ పెడితే… నిర్వహిచేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.  మన తెలంగాణకు ఎత్తిపోతలే దిక్కు. మనకు గ్రావిటీ తక్కువుంది. లిఫ్ట్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఎస్సారెస్పీలో కూడా మంచినీళ్లివ్వలేని పరిస్థితి. సింగూరులో సమస్యవస్తోంది. కరెంట్ బిల్లుల ఖర్చు రూ.10వేల కోట్లు ఔతుంది కావచ్చు.. రూ.15వేలకోట్లైనా కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులకోసం ఎంత ఖర్చైనా చేస్తాం. తెలంగాణ రైతులు ధనిక రైతులు అయ్యేంతవరకు లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్, కరెంట్ ఉచితంగా ఇస్తూనే ఇస్తాం. రైతులు రుణాలు చేసే పరిస్థితి రాకూడదు. వ్యవసాయ రంగ నిపుణుల సూచనల మేరకే.. కొత్త రెవెన్యూ చట్టం కూడా తెస్తున్నాం” అంటూ తెలంగాణ రాష్ట్ర చిన్న, సన్నకారు రైతుల రుణ విముక్తి కమిషన్ సవరణ బిల్లును ఆమోదించాలని సీఎం కోరారు.