జూనియర్ పంచాయితీ కార్యదర్శుల క్రమబద్దీకరణ...ఇవే నిబంధనలు

జూనియర్ పంచాయితీ కార్యదర్శుల క్రమబద్దీకరణ...ఇవే నిబంధనలు

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.  4 సంవత్సరాల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను, నిర్దేషించిన నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి, క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు  జులై 11వ తేదీ సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.

తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పంచాయితీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని సీఎం కేసీఆర్ అన్నారు.  దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో వారి కృషి ఇమిడివున్నదని చెప్పారు. సాధించిన దానితో సంతృప్తిని చెంది అలసత్వం వహించకూడదని.., తెలంగాణ పల్లెలు మరింతగా గుణాత్మక మార్పు చెంది, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందే దిశగా పంచాయితీ కార్యదర్శుల నిరంతర కృషి కొనసాగుతూనే ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో  నాలుగేళ్ల శిక్షణా కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను, నిర్దేషించిన నిబంధనల మేరకు వారి పనితీరును పరిశీలించి, క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 

ప్రొబేషన్ పీరియడ్ ను పూర్తి చేసుకున్న కార్యదర్శులను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుంది. కమిటీ పరిశీలనలో నిర్దేశించిన లక్ష్యాలను మూడింట రెండు వంతులు చేరుకున్న వారికి రెగ్యులరైజ్ చేయాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారిని పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ  సందీప్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావులను సీఎం ఆదేశించారు