దేశానికి దిక్సూచిగా తెలంగాణ

దేశానికి దిక్సూచిగా తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్విరామ కృషి ఫలితంగా రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జాతీయ జెండా ఎగరేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 2001 నుంచి అవిశ్రాంతంగా పోరాటం చేసినట్లు చెప్పారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత చేపట్టిన చర్యల ఫలితంగా తెలంగాణ అన్ని రంగాల్లో అతి తక్కువ కాలంలోనే దేశానికి దిశానిర్దేశం చేసే స్థాయికి చేరిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ పురోగమించి.. దేశానికే దారిచూపే టార్చ్ బేరర్గా నిలిచిందని చెప్పారు.

అన్ని రంగాల్లో అద్భుతాలు
విద్యుత్,  తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, ప్రజా సంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలలో రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే అద్భుతాలను ఆవిష్కరించిందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన ప్రగతిశీల, పారదర్శక విధానాల వల్ల రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగిందని చెప్పారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన సర్కారు పథకాల అమలు కోసం ఏటా రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో తీసుకున్న ఉద్దీపన చర్యల ఫలితంగా వ్యవసాయోత్పత్తులు కనీవినీ ఎరుగని స్థాయిలో పెరిగిపోయాయని అన్నారు. దేశంలో అన్నిరంగాలకూ 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం గర్వకారణమని చెప్పారు.

దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ
ఒకప్పుడు కరువు కాటకాలతో విలవిల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామలమై దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రుణమాఫీతో పాటు రైతు బంధు, రైతు బీమా పథకాల ద్వారా రైతన్నల గుండెల్లో విశ్వాసం నింపిందని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన రక్షిత జలాలను నల్లాల ద్వారా ఉచితంగా అందిస్తూ తెలంగాణ.. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. గురుకుల విద్యలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, అక్కడ చదివే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 1.25 లక్షలు ఖర్చు చేస్తోందని చెప్పారు. 

వైద్యారోగ్యంలో అద్భుత ప్రగతి
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వైద్యారోగ్య రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిందని కేసీఆర్ అన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే యజ్ఞం కొనసాగుతోందని చెప్పారు. టిమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లతో పాటు వరంగల్ లో మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రభుత్వం నిర్మిస్తోందని అన్నారు.

ఐటీ రంగంలో సాటిలేని ప్రగతి 
ప్రశాంతమైన, సురక్షితమైన, ప్రగతిశీల వాతావరణం ఉన్నచోటనే పారిశ్రామిక అభివృద్ధి పరుగులు తీస్తుందనడానికి తెలంగాణ రాష్ట్రం నిదర్శనమని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సుస్థిర పాలన, మెరుగైన శాంతిభద్రతలు, అవినీతికి, అలసత్వానికి ఆస్కారంలేని విధంగా రూపొందించిన టీఎస్ -ఐపాస్ పారిశ్రామిక విధానం వల్ల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రంగంలో ఎనిమిదేళ్లలో రూ.2, 32,111 కోట్ల పెట్టుబడులు తరలిరాగా.. 16,50,000 వేల ఉద్యోగాల కల్పన జరిగిందని స్పష్టం చేశారు. 

పేట్రేగుతున్న మతోన్మాత శక్తులు
దేశంలో, రాష్ట్రంలో మతోన్మాదశక్తులు పేట్రేగి పోతున్నాయని ముఖ్యమంత్రి మండిపడ్డారు. సంకుచిత ప్రయోజనాల కోసం విద్వేషపు మంటలు రగిలిస్తూ, విషపూరిత వ్యాఖ్యలతో ఆజ్యం పోస్తున్నారని అన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో వీసమెత్తు సంబంధంలేని ఈ అవకాశవాదులు, ఆషాడ భూతులు చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

వీర యోధులను నివాళి
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరునా తలుచుకోవడం మన కర్తవ్యం.. వారందరి ఉజ్వల స్మృతికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. ఆనాటి అద్భుత ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూ, తెలంగాణ సమాజాన్ని నిరంతరం ఉద్విగ్నపరుస్తూనే ఉంటాయని చెప్పారు. కొమరం భీమ్, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, సర్దార్ జమలాపురం కేశరావు, వట్టికోట ఆళ్వార్ స్వామి, చాకలి ఐలమ్మ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి ఆరుట్ల కమలాదేవి తదితరులను  ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు.