పోరాటాల పురిటిగడ్డ.. నల్గొండ ముద్దుబిడ్డ నోముల

పోరాటాల పురిటిగడ్డ.. నల్గొండ ముద్దుబిడ్డ నోముల

రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే ఆనవాయితీగా దివంగత సభ్యులకు సంతాపం ప్రకటించారు. కరోనావైరస్ కారణంగా చనిపోయిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డిని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సభాముఖంగా వారిద్దరికి సంతాపం వ్యక్తం చేశారు. పోరాటాల పురిటిగడ్డ.. నల్గొండ ముద్దుబిడ్డ నోముల అని సీఎం కొనియాడారు. నోముల అకాలమరణం తెలంగాణకు తీరనిలోటని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో నోములకు పాల్గొనాలని ఉన్నా.. సీపీఎం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఆగిపోయారని సీఎం కేసీఆర్ అన్నారు. ఉద్యమంలో ఏదో ఒకచోట కలుస్తానని నోముల టీఆర్ఎస్‌లో చేరకముందే చెప్పారని కేసీఆర్ అన్నారు. నువ్వు మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం వదిలిపెట్టొద్దని నోముల అన్నారని కేసీఆర్ సభలో తెలిపారు.

ఎమ్మెల్యే నోములతో తనకు 8 సంవత్సరాలుగా అనుబంధముందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని కేటీఆర్ కొనియాడారు. అణగారిన వర్గాల కోసం గొంతు విప్పిన నేతగా నోములకు రాష్ట్రవ్యాప్తంగా పేరుందని కేటీఆర్ అన్నారు.

దివంగత ఎమ్మెల్యే నోముల పేదల అభివృద్ధి కోసం నిత్యం పనిచేసేవారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

అనారోగ్యంగా ఉన్నా కూడా సభకు వచ్చి సమస్యలపై మాట్లాడేవారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

సినిమాటోగ్రఫి శాఖ మంత్రి మంత్రి తలసాని సభలో మాట్లాడుతూ.. నోములను చూసి అందరూ చాలా నేర్చుకోవాలని ఆయన ప్రశంసించారు.