పదవుల కోసం పార్టీల్లో చీలికలు : కేసీఆర్

పదవుల కోసం పార్టీల్లో చీలికలు : కేసీఆర్
  • దేశంలో రాజకీయాలు పదవుల వెంట పరుగులు పెడుతున్నయ్
  • మహారాష్ట్రలో సొంత పార్టీలనే చీల్చే పాలిటిక్స్‌‌‌‌ను చూస్తున్నం
  • తెలంగాణలా మహారాష్ట్రను అభివృద్ధి చేసే బాధ్యత నాదే
  • రెండు రాష్ట్రాలది రోటీ – బేటీ బంధమని కామెంట్

హైదరాబాద్, వెలుగు: దేశంలో రాజకీయాలు పదవుల వెంట పరుగులు పెడుతున్నాయని బీఆర్ఎస్‌‌‌‌ చీఫ్, సీఎం కేసీఆర్ అన్నారు. నాయకులు తమ పార్టీలనే చీలికలు పేలికలు చేసుకుంటూ ఆ పార్టీల నుంచి ఈ పార్టీలకు జంపులు చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో సొంత పార్టీలనే చీల్చే రాజకీయాలను దేశంలోని ప్రజలంతా చూస్తున్నారన్నారు. శనివారం మహారాష్ట్రలోని సోలాపూర్, నాగపూర్ నుంచి వివిధ పార్టీల నాయకులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌‌‌‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘మహారాష్ట్రతో తెలంగాణది ‘రోటీ – బేటీ’ బంధం. రెండు రాష్ట్రాలు వెయ్యి కి.మీ.ల సరిహద్దును పంచుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల ప్రజల నడుమ మొదటి నుంచీ సామాజిక బాంధవ్యం, సాంస్కృతిక సారూప్యత ఉంది. అట్లాంటి అనుబంధమున్న మహారాష్ట్ర నుంచే బీఆర్ఎస్‌‌‌‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తుండడం ఎంతో ఆనందంగా ఉంది. తొమ్మిదేండ్లలోనే అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇదే స్ఫూర్తితో మహారాష్ట్రను ప్రగతి పథంలో నడిపించుకుందాం” అని పిలుపునిచ్చారు.

అభివృద్ధి మీ గడప ముందుకు వచ్చింది..

స్వాతంత్ర్య సమరయోధులు భగత్​సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వారిని ఆదర్శంగా తీసుకొని దేశ ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత యువతపై ఉందని కేసీఆర్ అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు అభివృద్ధి చెందుతుంటే మనం ఎందుకు వెనుకబడి ఉన్నామో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. దేశంలో అవసరానికి మించి నదీ జలాలు, ఇతర వనరులు ఉన్నా.. వెనుకబడి పోవడానికి కేంద్రంలోని పాలకులు అనుసరిస్తున్న విధానాలే కారణమని విమర్శించారు. ప్రపంచ దేశాల ముందు, అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌లో మన దేశ ఇజ్జతి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాగు, సారునీరు, కరెంట్​లాంటి సౌకర్యాలు లేక ఇంకెన్నాళ్లు అభివృద్ధికి దూరంగా ఉందామని, అభివృద్ధి నిరోధకులు ఇంకెన్నాళ్లు ఓట్లు వేసి గెలిపించుకుందామని ప్రశ్నించారు. బీఆర్ఎస్​రూపంలో అభివృద్ధి మీ గడప ముందుకు వచ్చి నిలబడిందని, దాన్ని ఆదరించాలని పిలుపునిచ్చారు.

దేశమంతా విస్తరిస్తం

మహారాష్ట్ర మీదుగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్​సహా దేశమంతటా బీఆర్ఎస్ విస్తరిస్తుందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూసేందుకు తెలంగాణ మొత్తం పర్యటించి రావాలని, అందుకు తగిన ఏర్పాట్లు తాము చేస్తామన్నారు. తాను మళ్లీ సోలాపూర్​కు వస్తానని, అంతకు వారం రోజుల ముందే మంత్రి హరీశ్​రావును పంపిస్తానని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ర్యాలీ తీద్దామని, కనీసం 50 ఎకరాల స్థలంలో బహిరంగ సభ పెట్టుకుందామన్నారు. ‘‘తెలంగాణ తీర్ల మహారాష్ట్రను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాదే. మీ భవిష్యత్​కు భరోసా ఇస్తున్నాం. బీఆర్ఎస్​ను గెలిపించుకొని జీవితాలను మీరే తీర్చిదిద్దుకోవాలి” అని చెప్పారు. తెలంగాణ నుంచి వలస వెళ్లి సోలాపూర్​లో స్థిరపడిన కుటుంబాల ప్రజలు, పలువురు నాయకులు బీఆర్ఎస్​లో చేరారు.