తెలంగాణ రైతులు నియంత్రిత విధానంలోనే వ్యవసాయం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం చెప్పినట్టు పంటను వేసి మంచి ధరను సాధించాలన్నారు. సోమవారం సాయంత్రం కేబినేట్ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తోందని.. వారు బాగుపడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వానకాలంలో మొక్కజొన్న, వరి ఎక్కువగా పండవని.. పత్తి చేను వేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని అన్నారు. వచ్చే వానాకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి, 40 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో కంది వేయాలని సీఎం కేసీఆర్ చెప్పారు.తెలంగాణలో 5 రకాల నేలలు ఉన్నాయని, ఇక్కడి వాతావరణ పరిస్థితులు పంటలకు అనుకూలంగా ఉందన్నారు. పంటల ఉత్పత్తి లో తెలంగాణ రికార్డు తిరగరాస్తుందని, ఇరిగేషన్ ప్రాజెక్టు లు కూడా తొందరగా పూర్తి అవుతాయని అన్నారు.
దేశంలో రైతు బంధు తెలంగాణలో తప్ప మరెక్కడా లేదని, మనం ఇచ్చిన పైసలు ఎవ్వరు ఇవ్వడం లేదన్నారు కేసీఆర్. రైతు భీమా కూడా దేశంలో ఎక్కడ లేదని , ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం కూడా మనదేనన్నారు. రైతులకు సబ్సిడీలు ,పాలీహౌస్, గ్రీన్ కల్టీ వేశన్ ఒక్క తెలంగాణ లోనే ఉందని అన్నారు. పశువుల పంపిణీ, ట్రాక్టర్ ల పంపిణీ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇస్తున్నామన్నారు.
తెలంగాణ లో అద్భుతమైన పత్తి పండుతుందని, .కాటన్ కు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు సీఎం. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు వేయాలని అన్నారు. 7 లక్షల ఎకరాలలో పత్తి పెట్టాలన్నారు .నీళ్లు ఉన్న దగ్గర పత్తి వేయాలని, నీళ్లు ఎక్కువగా పెడితే పత్తి ఎక్కువ దిగుబడి వస్తుందని అన్నారు. 40 లక్షల ఎకరాలలో వరి పంట వేయాలని, 15 లక్షలు కందులు వేయాలని సూచించారు.
వర్షా కాలంలో మక్కలు వేయకండని సీఎం సూచించారు. వర్షాకాలంలో మక్కలు కొనే వారు ఎవ్వరు లేరని, యాసంగి లో పండించుదామని చెప్పారు. ప్రస్తుతం కరోనా ఉంది కాబట్టి ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. ప్రతీసారి కొనేందుకు ప్రభుత్వం కొనుగోలు సంస్థ కాదని చెప్పారు. మక్కలు వేసే బదులు కంది పంట వేయాలని చెప్పారు. వరి పంట కూడా ప్రభుత్వం చెప్పింది వేయకపోతే రైతు బంద్ ఉండదని చెప్పారు. తెలంగాణ పంటలన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోవాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. . తెలంగాణ సోనా అనే వరి వంగడం ను మన తెలంగాణ శాస్త్రవేత్తలు కనుగొన్నారని , షుగర్ ను తగ్గించే గుణాలున్న వరిని మన వాళ్ళు కనుగొన్నారన్నారు. 10 లక్షల ఎకరాల్లో దాన్ని పండించాలని, ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం చెప్పారు. అభ్యుదయ వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి. రైతుల ఆదాయం పెరగాలని సీఎం కేసీఆర్ అన్నారు.ఏయే జిల్లాలో ఏయే పంటలు వేయాలి అనేది త్వరలోనే చెపుతామన్నారు.
