
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం లోక్ సభ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం (ఎల్ ఎండీ) సమీపంలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సభకు రెండు లక్షల మందిని తరలించాలని పార్టీ శ్రేణులు టార్గెట్ పెట్టుకున్నాయి. కరీంనగర్ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల నుంచి జనం ఈ బహిరంగ సభకు రానున్నారు.
సెంటిమెంట్‌తో..
టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కు కరీంనగర్ జిల్లా సెంటిమెంట్ గా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నుంచి మొదలుపెట్టడం గమనార్హం. తాజాగా లోక్ సభ ప్రచారాన్నీ జిల్లా నుంచే ప్రారంభిస్తున్నారు. దీనిపై ఈనెల 11న తెలంగాణ భవన్ లో నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశంలోనే సీఎం స్పష్ట త ఇచ్చారు. తొలుత మానకొండూర్ నియోజకవర్గం లోని ఎల్‌ఎండీ కాలనీలో సభ నిర్వహించాలనుకున్నా.. తర్వాత జిల్లా కేంద్రానికి మార్చారు. సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ లో బయల్దేరుతారు. కలెక్టరేట్ హెలిప్ యాడ్ వద్ద దిగి.. ప్రత్యేక కాన్వాయ్ లో సభా స్థలానికి వస్తారు. ఐదు గంటలకు సభ ప్రారంభం కానుంది.
రాత్రికి అక్కడే బస
సభ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ లో బస చేయనున్నారు. స్థానిక నేతలతో భేటీ అయి.. స్థానిక రాజకీయ పరిస్థితులు, పెండింగ్ పనులు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం, ఎస్సారెస్పీ స్టేజ్ -2 పనులు ఏ విధంగా సాగుతున్నాయన్న అంశాలపై చర్చిం చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అభివృద్ధి, ప్రాజెక్టుల పనులపై ప్రభావం వంటి వాటిపై ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తారని సమాచారం. ఉత్తర తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నా .. నిర్లక్ష్యంగా ఉండొద్దని, భారీ మెజార్టీలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కష్టపడాలని దిశానిర్దే శం చేయనున్నట్టు పార్టీ వర్గా లు చెబుతున్నాయి.
అభ్యర్థిని ప్రకటిస్తారా?
సీఎం కేసీఆర్ కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్ ను ఖరారు చేశారని, సభా వేదిక పై అధికారి కంగా వెల్లడిం చే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నా యి. కరీంనగర్ ఎంపీగా వినోద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కోరనున్నట్టు సమాచారం. 19న నిర్వహించబోయే నిజామాబాద్ సభలోనూ ఇలాంటి విజ్ఞప్తి చేసే అవకాశాలున్నాయి. కరీంనగర్ సభతో జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుందని ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం ఎల్ ఎండీ సమీపంలో సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.