వర్షాలపై అప్రమత్తంగా ఉండండి.. : సీఎం కేసీఆర్​

వర్షాలపై అప్రమత్తంగా ఉండండి.. : సీఎం కేసీఆర్​

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండా లని సీఎం కేసీఆర్ రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మరో నాలుగు రోజులు భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో శుక్రవారం సెక్రటేరియెట్​లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరిలో వరదల పరిస్థితి, భద్రాచలం వద్ద ముంపు పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాజెక్టుల్లో చేరుతున్న వరద గురించి తెలుసుకున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అంతా అదుపులోనే ఉందని, అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్నామని సీఎస్‌‌‌‌ శాంతి కుమారి సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎంవో అధికారులు, ‘సటాకే’ ఇండియా డైరెక్టర్ ఆర్​కె బజాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఎగుమతుల దిశగా వరి ఉత్పత్తులు

రాష్ట్రంలో వరిధాన్యం దిగుబడి నాలుగు కోట్ల టన్నులకు చేరుకునే అవకాశాలున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసె సింగ్ కంపెనీలను స్థాపించాలని నిర్ణయించినట్లు కేసీఆర్‌‌‌‌ వెల్లడించారు. ఇందుకోసం మరిన్ని మోడర్న్ రైస్ మిల్లులను అందుబాటులోకి తేవాలని మిల్లింగ్​కెపాసిటీపై సమీక్షలో తెలిపారు. ‘‘రాష్ట్రంలో వరి దిగుబడి పెరిగింది. ఫుడ్ ప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేసి వరి ఉత్పత్తులను ఎక్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ అయ్యేలా చూడాలి. అప్పుడే వరికి గిరాకీ పెరిగి రైతులు లాభాలు గడిస్తరు. అదనంగా పండే వరి పంటను దృష్టిలో వుంచుకుని కొత్తగా అధునాతన  మిల్లులు ఏర్పాటు చేయబోతున్నం. దీని కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశాం. ‘సటాకే’ వంటి కంపెనీలతో చర్చించినం. వారితో కమిటీ చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆదేశించినం’’ అని సీఎం కేసీఆర్‌‌‌‌ అన్నారు. 

కమిటీకి చైర్మన్​గా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును నియమించారు. సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటీ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, టీఎస్ ఐఐసీ ఎండీ నర్సింహా రెడ్డి సభ్యులుగా కొనసాగుతారు.

ప్రజల్లో చైతన్య జ్వాల రగిలించిన దాశరథి

సాయుధ పోరాట కాలంలో తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్య జ్వాల రగిలించిన దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డగా సీఎం కేసీఆర్‌‌‌‌ కొనియాడారు. కృష్ణమాచార్య 99వ జయంతి సందర్భంగా శుక్రవారం దాశరథి సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.