సర్కార్​ చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు!

సర్కార్​ చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు!

హైదరాబాద్, వెలుగు: ‘‘రైతులంతా ఒకే పంట వేసి నష్టపోవద్దు. ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చేసే పద్ధతి రావాలి. సర్కారు చెప్పిన పంటలు వేయని రైతులకు రైతుబంధు సాయాన్ని ఆపివేయాలి. అలాంటి వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయవద్దు” అని రాష్ర్ట ప్రభుత్వానికి అగ్రికల్చర్ ఎక్స్ పర్టులు, అధికారులు సూచించారు. రాష్ట్రంలో పంటల సాగు విధానం, ఇతర పంటల గుర్తింపు, రైతులతో నియంత్రిత పద్ధతిలో సాగు చేయించడం, పండిన పంటకు మంచి ధర వచ్చేలా చూడడం తదితర అంశాలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం రివ్యూ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి అగ్రికల్చర్ ఎక్స్ పర్టులు సలహాలు, సూచనలు ఇచ్చారు.

లేకుంటే కనీస మద్దతు ధర ఇవ్వొద్దు

‘‘రాష్ట్రంలో రైతులంతా ఒకే విధమైన పంట సాగు చేస్తారు. అలా చేస్తే పంటకు మంచి ధర రాదు. మార్కెట్ డిమాండును బట్టి పంట పండించాలి. దీనికి నియంత్రిత పద్ధతి రావాలి. క్రమపద్ధతి అలవాటు కావడం కోసం కొంత కఠినంగానే వ్యవహరించాలి. అగ్రికల్చర్ ఆఫీసర్లు, సైంటిస్టులు, ఎక్స్ పర్టులు.. ఎక్కడ ఏ పంట ఎంత మేర వేయాలో నిర్ణయిస్తారు. అందుకు అనుగుణంగా రైతులు సాగు చేయాలి. సూచించిన పంటలు వేయని రైతులకు ప్రభుత్వం రైతుబంధు సహాయాన్ని నిలిపి వేయాలి. వారు పండించిన పంటలను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయవద్దు” అని సర్కారుకు ఆఫీసర్లు, ఎక్స్ పర్టులు సూచించారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల వల్ల ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పంటల కొనుగోళ్లు జరుపుతున్నది. ఏటా ఇలాగే కొనుగోళ్లు జరపడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. మార్కెట్లో డిమాండ్ ఉంటేనే మంచి ధర వస్తుంది. డిమాండ్ కు అనుగుణంగానే పంటలు పండించాలి” అని వివరించారు.

పామాయిల్ సాగు పెరగాలి

‘‘30 నుంచి40 ఏళ్లపాటు దిగుబడి వచ్చే పామాయిల్ సాగును రాష్ర్టంలో విస్తరించాలి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 50 వేల ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 10 వేల ఎకరాల్లో పామాయిల్ పండిస్తున్నారు. రాష్ట్రంలో 5 లక్షల నుంచి 10 లక్షల ఎకరాలు పామాయిల్ సాగు చేయవచ్చు” అని సూచించారు. ప్రభుత్వం చెప్పిన పంట విత్తనాలు మాత్రమే మార్కెట్లో లభ్యమయ్యేలా చూడాలని.. వ్యాపారులు తమకు తోచిన విత్తనాలను రైతులకు అంటగట్టే పద్ధతి పోవాలని కోరారు. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు స్టడీ చేసి, సూచనలివ్వడానికి ఎక్స్ పర్టుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. రివ్యూలో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, పెద్దాఫీసర్లు, ఎక్స్ పర్టులు పాల్గొన్నారు.

ఏ పంట.. ఎన్ని ఎకరాలు..?

ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు ప్లాన్ రూపొందించారు. ఏడాదిలో 2 పంటలకు కలిపి వరి 80 లక్షల నుంచి-90 లక్షల ఎకరాలు, పత్తి 50 లక్షల ఎకరాలు, కంది 10 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 7 లక్షలు, వివిధ రకాల విత్తన ఉత్పత్తి 7 లక్షల ఎకరాలు, మిర్చి రెండున్నర లక్షల ఎకరాలు, కూరగాయలు మూడున్నర లక్షల ఎకరాలు, వేరుశనగ రెండున్నర లక్షల ఎకరాలు, పసుపు 1.25 లక్షల ఎకరాలు, కొర్రలు, మినుములు, పెసర్లు, ఆవాలు, నువ్వులు లాంటి పంటలు మరో రెండు లక్షల ఎకరాలు, కొద్దిపాటి విస్తీర్ణంలో సోయాబీన్ పండించడం మేలని సూచించారు. వరి రకాలను మార్కెట్ అవసరాలకు తగినట్లుగా పండించాలన్నారు. తెలంగాణ సోనా రకాన్ని వర్షాకాలంలోనే 10 లక్షల ఎకరాల్లో పండించాలని, విత్తనాలను వ్యవసాయ వర్సిటీ సిద్ధం చేసిందని చెప్పారు.

జిల్లా, మండల అధికారులతో త్వరలో సీఎం మీటింగ్

రాష్ట్రంలో అమలు చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానంపై జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో త్వరలో సమావేశం కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు బంధు సమితి ప్రతినిధులతో మాట్లాడునున్నారు. ‘‘దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అద్భుత తెలంగాణ రూపొందుతున్నది. వ్యవసాయ అధికారులు, రైతు బంధు సమితి, వ్యవసాయ వర్సిటీ, పౌర సరఫరాల సంస్థ సమన్వయంతో వ్యవహరించి, రైతులకు మేలు చేసే వ్యవసాయ విధానాన్ని అమలు చేసే చైతన్యం కలిగించాలి. రాష్ట్రంలో రాబోయే కాలంలో రెండు కోట్ల 70 లక్షల టన్నుల వరి వస్తుంది. ఇంత ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి రైస్ మిల్లులు కెపాసిటీ పెంచుకోవాలి. రైతుల పంటలను కొనడమే కాకుండా, పంటను కన్సూమర్లకు చేర్చే బాధ్యతను సివిల్ సప్లై శాఖ తీసుకోవాలి. దీనివల్ల రైతులకు మంచి ధర వస్తుంది. వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు అందుతాయి. కల్తీలను అరికట్టవచ్చు’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.