పల్లెలకు కేంద్రమే నేరుగా నిధులిచ్చుడేంది..!

పల్లెలకు కేంద్రమే నేరుగా నిధులిచ్చుడేంది..!
  • స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తయ్​
  • ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే
  • తడిసిన ధాన్యాన్ని కూడా కొంటం
  • పట్టణ, పల్లె ప్రగతి జూన్‌‌ 3కు వాయిదా
  • హైదరాబాద్​ పబ్లిక్​ గార్డెన్​లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
  • సమీక్షా సమావేశంలో సీఎం వెల్లడి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను నమ్మకుండా నేరుగా పల్లెలకు నిధులు పంపుతున్నదని, ఇది చిల్లర వ్యవహారంగా ఉందని సీఎం కేసీఆర్‌‌‌‌  మండిపడ్డారు. పంచాయతీరాజ్‌‌‌‌ వ్యవస్థలో మూడంచెల విధానం తెచ్చిన రాజీవ్‌‌‌‌గాంధీ నుంచి ఇప్పుడు ప్రధాని పదవిలో ఉన్నవారి వరకు ఇలా చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పల్లె, పట్టణ ప్రగతి అమలుతో పాటు పలు అంశాలపై బుధవారం ప్రగతి భవన్‌‌‌‌లో మంత్రులు, కలెక్టర్లు, మేయర్లు, మున్సిపల్‌‌‌‌ చైర్​పర్సన్లు, అధికారులతో కేసీఆర్‌‌‌‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జవహర్‌‌‌‌ రోజ్‌‌‌‌గార్ యోజన, ప్రధాని గ్రామ సడక్‌‌‌‌ యోజన, ఉపాధి హామీ లాంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా నేరుగా కేంద్రమే ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు. రాష్ట్రాల్లోని స్థానిక పరిస్థితులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి తప్ప కేంద్రానికెలా తెలుస్తాయని ప్రశ్నించారు. దేశం 75 ఏండ్ల ఆజాదీకా అమృత్​ మహోత్సవ్ జరుపుకుంటున్న పరిస్థితుల్లోనూ ఇంకా కరెంట్‌‌‌‌ లేక చీకట్లో మగ్గుతున్న పల్లెలు, పట్టణాలు ఉన్నాయని, తాగు, సాగునీళ్లు లేక ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని, విద్య, వైద్యంలో ప్రగతి సాధించలేదని కేసీఆర్​ అన్నారు.  

ఇంటింటికీ నీళ్లందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే
ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రగతిని ఇటీవల కొన్ని జాతీయ మీడియా చానళ్లు ప్రసారం చేసిన కథనాలు చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు ఆశ్చర్యపోయారని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి తనకు ఫోన్‌‌‌‌లు చేసి అడుగుతున్నారని చెప్పారు. అర్బన్‌‌‌‌ పార్కులు ఏర్పాటు చేయాలని, అడవులను పునరుజ్జీవింపజేయాలని అధికారులకు సూచించారు. 

ఎంత ఖర్చయినా చివరి గింజ వరకు కొంటాం
ఎంత ఖర్చయినా తడిసిన ధాన్యం సహా చివరి గింజ వరకు వడ్లనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కేసీఆర్​ చెప్పారు. ధాన్యం సేకరణలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని సీఎం సూచించారు.  

దేశమే గర్వించేలా అభివృద్ధి
విధ్వంసమైన వ్యవస్థలను పునర్​నిర్మించుకోవడం చాలా కష్టమైన పని అని, ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన తెలంగాణను తిరిగి బాగు చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని కేసీఆర్​ అన్నారు. ఆ కష్టాలన్ని అధిగమించి దేశమే గర్వించేలా పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. కేంద్రం రెండు పర్యాయాలు ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో పదికి పది, 20కి 19 మన పల్లెలే ఉన్నాయన్నారు. కర్నాటకలో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన కర్నాటకకు చెందిన  పద్మశ్రీ అవార్డు గ్రహీత, 110 ఏండ్ల తిమ్మక్కను ఈ సందర్భంగా సీఎం సత్కరించారు. ఈ నెల 20 నుంచి నిర్వహించ తలపెట్టిన పల్లె, పట్టణ ప్రగతిని ఎండల తీవ్రత వల్ల జూన్‌‌‌‌ మూడో తేదీ నుంచి ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’ ఏర్పాటు చేయాలన్నారు. 19 వేల గ్రామాలు, ఐదు వేల వార్డుల్లో కలిపి మొత్తంగా 24 వేల గ్రామీణ క్రీడా కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. 

పబ్లిక్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లో ఆవిర్భావ దినోత్సవం
జూన్‌‌‌‌ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను హైదరాబాద్​లోని పబ్లిక్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లో నిర్వహించాలని సీఎం ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహిస్తారని చెప్పారు. రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలియజేస్తూ ప్రసంగాలు సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్‌‌‌‌లోని రవీంద్రభారతితో పాటు జిల్లా కేంద్రాల్లో కవి సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. దళితబంధు పథకాన్ని దశలవారీగా అమలు చేస్తామని, ఈ ఏడాది నియోజకవర్గానికి 1,500 మందిని ఎంపిక చేస్తామని సీఎం కేసీఆర్​ చెప్పారు.

రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌‌‌‌?
సీఎం కేసీఆర్‌‌‌‌ శుక్రవారం ఢిల్లీకి వెళ్లే అవకాశముందని ప్రగతి భవన్‌‌‌‌ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఉద్యమంలో మృతి చెందిన  రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నట్లు సమాచారం.  వారికి రూ.3 లక్షల చొప్పున సహాయం అందజేస్తామని సీఎం కేసీఆర్‌‌‌‌ ఇదివరకే ప్రకటించారు. మొదటి విడతగా కొందరికి చెక్కులు అందజేసే అవకాశముంది.