
రాష్ట్రంలో భారీ వర్షాలతో జరుగుతున్న నష్టం, తీసుకోవాల్సిన సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ వరుస రివ్యూలు చేశారు. ముంపు గ్రామాలు, ప్రాంతాల్లోని జనాన్ని రక్షించేలా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేశారు. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అలర్ట్ గా ఉండాలన్నారు. భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో సహాయ, రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో ఎప్పటికప్పుడు ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ యంత్రాంగం తరలించేలా ఆదేశాలిచ్చారు. ప్రకృతి విపత్తు వల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్న కోణంలో సీఎంవో కార్యాలయంలో రివ్యూలు జరిగాయి. రివ్యూ మీటింగ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి సహా ఇరిగేషన్, రోడ్లు భవనాలు, విద్యుత్, వైద్యం, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వరదలపై సీఎం పర్యవేక్షణతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు అలర్ట్ అయ్యారు. మరిన్ని రోజులు భారీ వర్షాలు ఉండడంతో చర్యల్లో తక్షణ సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వ యంత్రాంగం క్రమం తప్పకుండా పాల్గొనేలా నాలుగు రోజులపాటు సీఎం స్వయంగా పర్యవేక్షించనున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులు అధికార అధికారులతో స్వయంగా మాట్లాడి అవసరమైన చోట NDRF బృందాలు, రెస్క్యూ టీంలు హెలికాప్టర్లను సిద్దం చేయాలని సూచనలు చేశారు. అటు కడెం ప్రాజెక్టు పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో CM ఫోన్ లో మాట్లాడినట్లు CMO నోట్ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులు పొడగించింది ప్రభుత్వం. మరో 2, 3 రోజుల వరకు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సోమవారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. జులై 18న విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.
భద్రాచలంలో పెరుగుతున్న వరద ఉదృతిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ముందుగా భద్రాచలంలోని గోదావరి వంతెన పై వరద ఉధృతిని పరిశీలించారు. ఆ తర్వాత లోతట్టు ప్రాంతమైన సుభాష్ నగర్ కాలనీలో వరద బాధితులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంత ప్రజలందరూ వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మంత్రి పువ్వాడ సూచించారు. ఆ తర్వాత భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భద్రాచలం ఏజెన్సీలో తక్షణ సహాయక చర్యల కోసం హెలికాప్టర్ సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ITDA, ITC లో హెలిప్యాడ్ సిద్దం చేశామన్నారు. వరద తగ్గేవరకు భద్రాచలంలోని ఉంటానని మంత్రి పువ్వాడ చెప్పారు. భద్రాచలం వద్ద గోదావరి 66 అడుగులకు వచ్చే ఛాన్స్ ఉందని జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ను మంత్రి పువ్వాడ ఆదేశించారు. 24 గంటలు పని చేసేలా కలెక్టరేట్, ఐటిడిఎ, సబ్ కలెక్టర్, ఆర్డిఓ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయించారు.రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నప్పటికీ.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండబోదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. వందేండ్లలో ఎన్నడూ పడనంత వర్షపాతం నమోదు అయినా రెప్పపాటు అంతరాయం లేకుండా సరఫరా అందించిన ఘనత తెలంగాణా విద్యుత్ సంస్థలకే దక్కిందన్నారు. వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. మొత్తంగా వరదలపై సీఎం రివ్యూలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల సహాయచర్యలు ఇవాళ కూడా కంటిన్యూ కానున్నాయి.