ప్రజల సొమ్మును షావుకార్లకు కట్టబెడుతున్న మోడీ:కేసీఆర్

ప్రజల సొమ్మును షావుకార్లకు కట్టబెడుతున్న మోడీ:కేసీఆర్

బీజేపీ దేశానికి చాలా ప్రమాదకరమని సీఎం కేసీఆర్ అన్నారు. 8 ఏండ్ల బీజేపీ పాలనలో దేశానికి ఏదైనా మంచి జరిగిందా అని ప్రశ్నించారు. సాగునీరు, విద్యుత్, సంక్షేమం వంటి ఏ రంగంలో దేశం అభివృద్థి చెందిందో చెప్పాలని సవాల్ విసిరారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్దమని కేసీఆర్ ప్రకటించారు. ప్రధాని మోడీ డైలాగులు మాత్రమే కొడతాడని..పని చేయడం చేతగాదని మండిపడ్డారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్..సబ్ కా బక్వాస్ అని ఎద్దేవా చేశారు. బేటీ పడావో బేటీ బచావో అంటారని...కానీ అంగన్ వాడీ సెంటర్లకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తారని విమర్శించారు. ఇదేనా బేటీ పడావో పథకం ఉద్దేశమని అని చురకలంటించారు. మోడీ వచ్చాక ..దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. ఏడాదికి వేల మంది పారిశ్రామిక వేత్తలు దేశాన్ని విడిచిపెట్టి పోతున్నారని చెప్పారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. ఎల్ఐసీ సంస్థ రూ. 35 వేల కోట్ల ఆస్తులను కలిగి ఉందని..అయినా..ఆ సంస్ధను షావుకార్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రూ. 14వేల కోట్ల ప్రజల ఆస్తులను మోడీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందన్నారు. దేశ సొత్తు ఇష్టం వచ్చిన వారికి అమ్మేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా..? అని ప్రశ్నించారు. దేశంలోని మేధావులు, యువకులు, ప్రజలు ఆలోచించాలని..ఈ దుష్ట సంప్రదాయం పోవాలన్నారు. 

ఇదేనా మేకిన్ ఇండియా...?

దేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లే దర్శనమిస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. పిల్లలు కాల్చే పటాకులు, పతంగులతో పాటు.. జాతీయ జెండాలను కూడా బీజేపీ ప్రభుత్వం  చైనా నుంచి దిగుమతి  చేసుకుంటోందన్నారు. ఇదేనా మేకిన్ ఇండియా అని ప్రశ్నించారు. ఊరూరా చైనా బజార్లు ఎందుకు వస్తున్నాయన్నారు. కుర్చీలు, నెయిల్ కట్టర్లు, బొమ్మలు.. అన్నీ చైనా నుంచే వస్తున్నాయన్నారు. మాట్లాడితే మేకిన్ ఇండియా అని డైలాగులు కొట్టే మోడీ...ప్రధానిగా ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 

మోసపోయి ఉంటే గోసపడతాం...

దేశ రాజధాని ఢిల్లీతో పాటు..మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కరెంట్ కోతలు, సాగునీటికి ఇబ్బందులున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. యూపీలో ఇప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు, దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని చెప్పారు. నాడు స్వాతంత్య్రం కోసం ఎంతో మంది యోధులు పోరాడారని..ప్రాణాలు అర్పించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని చెప్పారు. ఇందుకోసమేనా వారు స్వాతంత్య్రం తెచ్చిందని ప్రశ్నించారు. దేశంలోని ప్రతీ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా అవ్వాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు ఉండొద్దని చెప్పారు. దేశ భవిష్యత్ కోసమే చెప్తున్నానని.. మోసపోయి ఉంటే గోసపడతామని ప్రజలు ఆలోచించాలన్నారు. 


ఉచితాలు వద్దంటా..?

గతంలో పంటలు పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో  24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు. ఏడాదికి రూ.  13 వేల కోట్ల నుంచి రూ. 14 వేల కోట్ల వరకు రైతుల కోసం ప్రభుత్వం విద్యుత్ బిల్లులు చెల్లిస్తుందన్నారు. అన్నదాతల కోసం రైతు బీమా, రైతు బంధు పథకాలను అమలు చేస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా పథకాలు లేవని చెప్పారు. కానీ కేంద్రం ఉచితాలు ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తోందన్నారు. బోర్లకు మీటార్లు పెట్టాలని చెప్తోందని మండిపడ్డారు. అటు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్నామన్నారు. పది రోజుల్లో డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. 


10 రోజుల్లో రైతు బంధు..

మరో పదిరోజుల్లోపు రైతు బంధు నగదు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. కేబినెట్ మీటింగ్ లో రైతు బంధుపై నిర్ణయం తీసుకుంటామని..ఆ తర్వాత రైతు బంధు నిధులు విడుదల చేస్తామన్నారు. బ్యాంకుల్లో  డబ్బులు జమ చేయగానే..రైతుల ఫోన్లలో టింగు టింగు మంటూ మేసేజ్ లు వస్తాయన్నారు. ఎక్కడైనా ఈ తరహా పథకం ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ బతికున్నంత వరకు రైతు బంధు, రైతు బీమా  పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. 

 

కొండగట్టుకు రూ. 100 కోట్లు

కొండగట్టు ఆలయాన్ని దేశంలోనే గొప్ప ఆలయంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. దేశమే నివ్వెర పోయేలా ఆలయాన్నినిర్మిస్తామన్నారు. తానే వచ్చి నిర్మాణాలను మొదలు పెడతామన్నారు. అంజన్న ఆలయానికి ఇప్పటికే 384 ఎకరాలు ఇచ్చామన్నారు. ప్రఖ్యాత స్థపతులను తీసుకొచ్చి కొండగట్టును డెవలప్ చేస్తామన్నారు. యాదాద్రి క్షేత్రం వలే కొండగట్టును అభివృద్ధి చేస్తామని చెప్పారు. జగిత్యాల జిల్లా అవుతుందని కలలో కూడా అనుకోలేదన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే..జగిత్యాల జిల్లా అయిందన్నారు. రాష్ట్రం కోసం ఉద్యమం జరిగే సమయంలో ధర్మపురి వచ్చినప్పుడు గోదావరి పుష్కరాలు ఇక్కడ ఎందుకు జరగకూడదని సింహలా గర్జించానని చెప్పారు. 

జగిత్యాలకు వరాలు..

జగిత్యాల జిల్లాలోని బండలింగాపూర్ ను మండలంగా చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలోని  వరద కాల్వలపై తుములు నిర్మించుకున్నామన్నారు. వరద కాల్వల మీద 13వేల మోటర్లు ఉన్నాయని చెప్పారు. అటు వేములవాడలోని కథలాపూర్, భీమారంతో పాటు మరో మండలానికి సాగునీటిని సరఫరా చేస్తామన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మద్దుట్ల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్  ప్రాజెక్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్, టీఆర్ఎస్ కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలను చూశారని....ఈ ప్రాంతంలో అనేక మంది మంత్రులయ్యారని చెప్పారు. కానీ ఒక్కరు కూడా బీడీ కార్మికులకు పింఛన్ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తోందన్నారు. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులున్నారని..కానీ తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు పించన్ ఇస్తున్నట్లు వెల్లడించారు. 

తెలంగాణ మారింది..దేశం మారాలి

దేశంలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో..తలసరి ఆదాయంలో...ఆర్థిక వనరుల పెంపులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. 8 ఏండ్లలో తెలంగాణ పనిచేసిన మందం కేంద్రం పనిచేసుంటే..రాష్ట్ర తలసరి ఆదాయం పద్నాలుగున్నర లక్షలు ఉండేదన్నారు. కేంద్రం వల్ల తెలంగాణ మూడు లక్షల కోట్లు నష్టపోయిందని చెప్పారు. ఆనాడు తెలంగాణ నాయకత్వం పొరపాటు వల్ల ఎన్నో ఉద్యమాలు చేశామని.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. మళ్లీ ప్రజలు పొరపాటు చేయొద్దని చెప్పారు. గోల్మాల్ గోవిందం గాళ్లను నమ్మితే ఆగమైపోతామన్నారు. ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ కోరారు.