ధరణి పోతే దళారీ రాజ్యం వస్తది

ధరణి పోతే దళారీ రాజ్యం వస్తది
  • సింగరేణి ప్రైవేటైజేషన్​కు బీజేపీ కుట్రలు చేస్తున్నది
  • వికలాంగుల పింఛను మరో వెయ్యి పెంచుతం
  • మంచిర్యాల ప్రగతి నివేదన సభలో సీఎం
  • బీసీలకు సాయం, గృహలక్ష్మి, రెండో విడత గొర్రెల పంపిణీ షురూ

మంచిర్యాల/ కోల్ బెల్ట్, వెలుగు: రైతుల భూముల రక్షణ కోసం తాము ధరణి పోర్టల్ తీసుకొచ్చామని సీఎం కేసీఆర్​అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్న కాంగ్రెస్​నే.. గిరగిరా తిప్పి బంగాళాఖాతంలో విసిరేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించిన కేసీఆర్ నస్పూర్​లో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్​ను, బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్​ను ప్రారంభించారు. తర్వాత కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో ప్రసంగించారు. 

‘‘బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్​ను తీసుకొచ్చినం. ఇప్పుడు భూముల లొల్లులు, లంచాలు లేవు. గ్రామాల్లో కొట్లాటలు, హత్యలు లేవు. రైతు బొటనవేలు పెడితే తప్ప భూములను మార్చే అధికారం ఎవరికీ లేదు” అని అన్నారు. ‘‘ధరణి ఆధారంగానే రైతుబంధు, రైతుబీమా వస్తోంది. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్​అవుతుంది. 5 నిమిషాల్లో పాస్​బుక్ వస్తుంది. ఇవన్నీ ధరణి పుణ్యమే”అని అన్నారు. రాష్ట్రంలో 2.75 కోట్ల ఎకరాల భూమి ఉంటే 1.55 కోట్ల ఎకరాలు ధరణిలో నమోదు చేశామని వివరించారు.

దేశానికే తలమానికం తెలంగాణ 

అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ దేశానికే తలమానికంగా మారిందని కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో, 24 గంటల కరెంటు సప్లైలో, పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధిలో, తాగు, సాగునీటి రంగాల్లో తెలంగాణ నంబర్​వన్​గా ఉందన్నారు. రైతుబంధు కింద రూ.65వేల కోట్లు ఇచ్చాన్నామని, రైతు చనిపోతే కుటుంబానికి రూ.5లక్షల బీమా ఇచ్చి ఆదుకుంటున్నామని అన్నారు. గతంలో గోదావరిలో రూపాయి బిల్ల వేద్దామంటే నీళ్లుండేవి కాదని, నేడు 250 కిలోమీటర్లు జీవనదిగా మారిందని అన్నారు. యాసంగి సీజన్​లో దేశం మొత్తమ్మీద 94 లక్షల ఎకరాల్లో వరి పండితే ఒక్క తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో 3 కోట్ల మెట్రిక్​ టన్నులు పండుతోందని, దేశంలో వరి పండించే రాష్ర్టాల్లో అగ్రస్థానంలో నిలిచిందని కేసీఆర్​ వివరించారు.

గోదావరిపై హై లెవెల్ ​బ్రిడ్జి

బీసీ వృత్తికారులకు రూ.లక్ష ఆర్థికసాయం, సొంత భూమిలో ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షలు, రెండో విడత గొర్రెల పంపిణీని కేసీఆర్ ప్రారంభించారు. అలాగే చెన్నూర్​లో లక్ష ఎకరాలకు సాగునీరందించేందుకు రూ.1658 కోట్లలో చెన్నూర్​ లిఫ్ట్​ ఇరిగేషన్ స్కీం, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర పామాయిల్ ఇండస్ర్టీ, రూ.164 కోట్లతో మంచిర్యాలలో గోదావరిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, మెడికల్ కాలేజీ నిర్మాణాలకు కలెక్టరేట్​వద్ద శంకుస్థాపనలు చేశారు. వికలాంగుల పింఛను రూ.వెయ్యి పెంచుతున్నామని ప్రకటించారు. ప్రస్తుతం రూ.3016 ఉండగా, వచ్చే నెల నుంచి రూ.4016 చెల్లిస్తామన్నారు. ఈ సభలో మంత్రులు ప్రశాంత్​రెడ్డి, గంగుల కమలాకర్, అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి, ప్రభుత్వ విప్​ బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు..

సింగరేణిని కాంగ్రెస్ నాశనం చేసింది

సింగరేణిని కాంగ్రెస్​ పార్టీ సర్వనాశనం చేసిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సంస్థను అభివృద్ధి చేశామని చెప్పారు. 2014లో రూ.11 వేల కోట్లు ఉన్న టర్నోవర్​నేడు రూ.33వేల కోట్లకు పెరిగిందన్నారు. సింగరేణి లాభాలు రూ.2,184 కోట్లకు పెరిగాయన్నారు. 2014లో కార్మికులకు లాభాల్లో 18 శాతం బోనస్ ఇస్తే, ఇప్పుడు 30 శాతానికి పెంచామన్నారు. రానున్న దసరా పండుగకు రూ.700 కోట్ల బోనస్​ చెల్లిస్తామన్నారు. 19,463 మందికి డిపెండెంట్​ ఉద్యోగాలు ఇచ్చామని, 15,256 మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించామని కేసీఆర్​ వివరించారు. అలాగే కార్మికులు మరణిస్తే ఎక్స్​గ్రేషియా రూ.లక్ష నుంచి రూ.10 లక్షలకు పెంచామని, ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని, వీఆర్ఎస్​ తీసుకుంటే రూ.25 లక్షలు చెల్లిస్తున్నామని చెప్పారు.

సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న 28 వేల మందికి జీవో 76 పట్టాలు పంపిణీ చేశామన్నారు. సింగరేణి ప్రైవేటైజేషన్​కు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. దేశంలో 150 సంవత్సరాలకు సరిపడా 361 కోట్ల బిలియన్​ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి కేంద్రం బొగ్గు దిగుమతి చేసుకుంటోందని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదురించడానికే బీఆర్ఎస్​ఏర్పాటయిందని చెప్పారు.