మహోజ్వలమైన భారత నిర్మాణం కోసమే బీఆర్ఎస్ : కేసీఆర్

మహోజ్వలమైన భారత నిర్మాణం కోసమే బీఆర్ఎస్ : కేసీఆర్

మహోజ్వలమైన భారత నిర్మాణం కోసమే బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ ప్రాంతానికో, భాషకో, వ్యక్తి కోసమో పరిమితం కాదని ఇది ఒక యజ్జంలాగా ప్రజల్లో మార్పును తీసుకొస్తామన్నారు. దేశంలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరన్నారు. రైతులు ఢిల్లీలో ధర్నాలు చేసి చనిపోయినా ఎవరూ సానుభూతి తెలపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వారికి ఆర్థిక సాయం చేసి ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేకపోవడం దురదృష్టకరమన్నారు. 

లక్ష కిలోమీటర్ల ప్రయాణం తొలి అడుగుతోనే ప్రారంభం

బీఆర్ఎస్ ఎజెండాను దేశంలో వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఏపీ నేతలు తమ పార్టీలో జాయిన్ అయ్యారని సీఎం కేసీఆర్ అన్నారు.  స్వాతంత్ర్యానికి పూర్వం రాజకీయాలంటే త్యాగమని..దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు అర్పించేవారని గుర్తుచేశారు. కానీ కాలక్రమేణా అనేక మార్పులు సంభవించాయన్నారు. లక్ష్య సిద్ధి, సంకల్ప సిద్ధి ఉంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు. లక్ష కిలోమీటర్ల ప్రయాణం తొలి అడుగుతోనే ప్రారంభం అవుతుందన్నారు. దేశంలో పుష్కలంగా వనరులు ఉన్నా..వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని చెప్పారు. వనరులు, వసతులు ఉండి కూడా ప్రజలు ఎందుకు  కష్టాలు పడుతున్నారని..ఎవరి కోసం..ఎందుకోసం ఈ పరిస్థితులు వచ్చాయని ప్రశ్నించారు. ఇలాటి పరిస్థితులు ఇలాగే కొనసాగాలా...? అని కేసీఆర్ నిలదీశారు. ప్రజల్లో మార్పును తీసుకువస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అంటే తమాషాగా పెట్టిన పార్టీ కాదని చెప్పారు. 

దేశం చేరుకోవాల్సిన దశకు చేరుకోలేదు : కేసీఆర్

దేశం చేరుకోవాల్సిన దశకు చేరుకోలేదని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో నీళ్ళు ఉంటాయి పొలాలకు రావు, కరెంట్ ఉంటది కానీ వాడుకోరన్నారు. సెంట్రల్ లో సిన్సియర్ గవర్నమెంట్ ఉంటే దేశం లో 40 వేల టీఎంసీల నీటితో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వవచ్చునని కేసీఆర్ తెలిపారు. ఉమ్మడి ఏపీలో లేని కరెంట్ .. తెలంగాణకు ఇప్పుడు ఎట్లా వచ్చిందని కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ స్వీచ్ లో వేలు పెడితే వచ్చిందా.. ఒళ్లు వంచి, మెదడు కర్గ తీస్తే వచ్చిందని తెలిపారు.  బీఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్రం కోసమో పెట్టింది కాదని దేశంలో గుణాత్మకమైన మహోన్నత మార్పు కోసమే బీఆర్ఎస్ అని కేసీఆర్ స్పష్టం చేశారు. 

ఏది చేసైనా సరే ఎలక్షన్ గెలవడమే లక్ష్యంగా దేశంలో నడుస్తోందని కేసీఆర్ అన్నారు. అబద్ధాలు, కులాల కుంపట్లు, మతాల చిచ్చుతో ఎన్నికలు గెలవాలని చూస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. దేశంలో రైతులు ధర్నా చేసి చనిపోయినా కనీసం పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే కాగానే ఏదో అయిపోయినట్లు కొందరు  నేల విడిచి సాము  చేస్తు్న్నారన్నారు.  

చైనా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందని కేసీఆర్ అన్నారు. కరోనా వస్తే పీపీఈ కిట్లు కూడా చైనా నుంచే వచ్చాయని చెప్పారు. మేకిన్ ఇండియా అయితే ఏపీలో గల్లి గల్లి చైనా బజార్ షాప్ లు ఎందుకున్నయ్... ఇండియా బజార్ లు ఎందుకు లేవన్నారు.