నాపై జరిగినంత దాడి ఎవరిపైనా జరిగి ఉండదు : కేసీఆర్ 

నాపై జరిగినంత దాడి ఎవరిపైనా జరిగి ఉండదు : కేసీఆర్ 

హైదరాబాద్‌ : ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగినా ధైర్యంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించి తీరామని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమపథంలో ఎన్నిసార్లు రాజీనామా చేశామో లెక్కేలేదని చెప్పారు. రాజీనామాలను అస్త్రాలుగా వాడి ఆనాడు తెలంగాణ ఉద్యమం నడిపామన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరులకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నివాళి అర్పించింది. తెలంగాణ అమర వీరుల స్మారకం,  అమర జ్యోతిని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం అమరవీరులపై రూపొందించిన ప్రదర్శనను మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం తిలకించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన శ్రీకాంతాచారి, వేణుగోపాల్‌రెడ్డి, పోలీసు కిష్టయ్య, సిరిపురం యాదయ్య కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు సత్కరించారు.

ALSO READ: తెలంగాణను దొరల పాలన నుంచి విముక్తి కలిగించండి: వివేక్ వెంకటస్వామి

తెలంగాణ అమర వీరుల స్మారకం- అమరజ్యోతిని ప్రారంభించిన అనంతరం కేసీఆర్‌ మాట్లాడారు. ఉద్యమం రోజులను గుర్తు చేసుకున్నారు. ‘‘ఉద్యమం సమయంలో నాపై జరిగినంత దాడి ప్రపంచంలో ఏ నేతపైనా జరిగి ఉండదు. పార్లమెంటులోనే పెప్పర్‌ స్ప్రే చల్లే స్థాయికి వెళ్లారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ ఉద్యమం నడిపాను. నా నిరాహార దీక్ష తర్వాత ఉద్యమం కొత్త మలుపు తిరిగి చివరకు తెలంగాణ ప్రకటన వచ్చింది’’ అని కేసీఆర్‌ తెలిపారు.

‘‘1966లో ఖమ్మం నుంచి తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత అది యూనివర్శిటీలకు చేరింది. తెలంగాణ అనుభవించని బాధ లేదు. నాటి నుంచి నేటి వరకూ విద్యార్థులు ఎంతో గొప్పగా పని చేశారు. ఈరోజు రెండు పార్శ్వాలు కలగలిసిన రోజు. సంతోషం ఒక పాలు.. విషాదం రెండు పాళ్లుగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పేర్లు తలచుకోవాలి. ఖమ్మం జిల్లా ఇల్లందులో ఉద్యమ తొలికేక వినిపించింది. ఉద్యమాన్ని ప్రారంభించే ముందు పిడికెడు మందితో మేధోమదనం చేశాం. వ్యూహాత్మకంగా మలిదశ ఉద్యమం ప్రారంభించాం. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆజన్మ తెలంగాణ వాది. ఆయన మార్గదర్శనంలోనే నడిచాం. ఉద్యమ స్ఫూర్తిని జయశంకర్‌ కాపాడుకొంటూ వచ్చారు. రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది. అనేక మందిని మేము సంప్రదించి వ్యూహంతో బయలుదేరాం. ఉద్యమం సమయంలో విద్యార్థుల బలిదానాలు కలిచివేసింది. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేపట్టాను. కోమాలోకి వెళ్తే బతకవని నిమ్స్ డాక్టర్లు హెచ్చరించారు’’ అని వ్యాఖ్యానించారు. 

‘‘మహాత్మాగాంధీ ఆచరించిన అహింస మార్గంలో హింస లేకుండా తెలంగాణ సాధించాం. సమైక్య ఆంధ్ర తొత్తులు చేసిన దాడి ప్రపంచంలో ఏ నాయకుడిపైన కూడా జరగలేదు. 14Fతో హైదరాబాద్ లో ఉద్యోగాలు లేకుండా చేయాలని ఆనాటి సీఎం రోశయ్య చేశారు. అక్కడినుండి నేను ఉద్యమం చేయాలని పూనుకున్నాను. నేను చేసిన నిరాహార దీక్షతో ఢిల్లీ సర్కార్ దిగి వచ్చి తెలంగాణ  ప్రకటన చేసింది ఆనాటి కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత అడ్డుకోవాలని ఎంతో మంది ప్రయత్నం చేశారు’’ అని వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్. 

‘‘రమణారెడ్డి కళాచాతుర్యంతో అమరజ్యోతిని రూపొందించారు. తెలంగాణ చరిత్ర కళ్లకు కట్టేలా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తాం. ఈ చిహ్నం పేరు అమరజ్యోతిగా నామకరణం చేశాం. అమరుల పేర్లు ఫోటోలతో ప్రదర్శన ఉంటుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ సూచనా మేరకు ఈ స్థలంలో జ్యోతి నిర్మాణం సాగింది. అన్ని వర్గాల ప్రజలకు సాయం అందిస్తూ ప్రభుత్వం పురోగమిస్తోంది. ఇదే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది’’ అంటూ చెప్పారు సీఎం కేసీఆర్. 

‘‘తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారు గుర్తుకొస్తున్నారు. రాష్ట్రం కోసం అనేకమంది ప్రాణాలు వదిలారు. ఉద్యమంలో అనేక కేసులు, రబ్బర్ బుల్లెట్ల వర్షం కురిశాయి. మహత్తరమైన పోరాటం ఆనాడు సాగింది. తెలంగాణ ఉద్యమం చేస్తున్న సందర్బంలో అనేక మంది అమరుల అయ్యారు. 650 అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, ఆర్ధిక సాయం అందించాం. ఇంకా ఎవరైనా ఉంటే వాళ్లను కూడా ఆదుకుంటాం. కొంతమంది కుట్రదారులు, కుయుక్తులు ఏమాయే అమరుల స్థూపం అని అడిగారు. తెలంగాణకు ఎవరు వచ్చినా ఏ దేశం నుంచి డెలిగేట్ వచ్చినా ఇక్కడ నివాళులు అర్పించే విధంగా ప్రణాళిక చర్యలు తీసుకుంటాం. మీమీ ప్రాంతాల్లో జరిగిన ఉద్యమ గుర్తులు ఉంటే మాకు పంపండి. సచివాలయం ముందు  ఆమరవీరుల స్థూపం నిర్మించడానికి కూడా ఒక కారణం ఉంది. అమరుల త్యాగాలతో తెలంగాణ వచ్చింది అని గుర్తు చేసుకోవటానికి మంత్రులు, సీఎం చూసేలా ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇదే స్ఫూర్తి తో తెలంగాణ ముందుకెళ్తోంది’’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.