
హైదరాబాద్ను పవర్ ఐలాండ్గా మార్చినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. న్యూయార్క్, లండన్, పారిస్ నగరాల్లో కరెంట్ పోయినా..హైదరాబాద్లో కరెంట్ పోదన్నారు. హైదరాబాద్ నగరం పవర్ సెక్టార్‌లో అనుసంధానం అయిందన్నారు. హైదరాబాద్ దేశంలోని ఇతర నగరాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచమే అబ్బుర పడే విధంగా హైదరాబాద్ను డెవలప్ చేస్తామని చెప్పారు. అందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే వరల్డ్ బెస్ట్ గ్రీన్ సిటీ, బెస్ట్ లివబుల్ సిటీ అవార్డులు హైదరాబాద్కు వచ్చాయని వెల్లడించారు. అన్ని మతాలు, కులాలు, జాతులను అక్కున చేర్చుకున్న హైదరాబాద్..విశ్వనగరంగా మారుతుందని చెప్పారు. ఇక్కడ సమశీతల వాతావరణం ఉండటం వలన దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు భాగ్యనగరంలో నివసించేందుకు ఇష్టపడతారని చెప్పారు.
సేఫెస్ట్ సిటీ హైదరాబాద్..
హైదరాబాద్ చరిత్రలో సుప్రసిద్దమైందని సీఎం కేసీఆర్ అన్నారు. ఢిల్లీ కంటే వైశాల్యంలో, జనాభాలో హైదరాబాద్ పెద్దదని చెప్పారు. చెన్నైతో పాటు.. ఇతర నగరాల కంటే 1912లోనే విద్యుత్ వచ్చిన నగరం హైదరాబాద్ అని గుర్తు చేశారు. చెన్నైకు 1927లో కరెంట్ వచ్చిందన్నారు. దేశంలో నిజమమైన కాస్మా పాలిటన్ సిటీ హైదరాబాద్ అని కొనియాడారు. భూగోళం మీదనే సేఫెస్ట్ సిటీ హైదరాబాద్ అని....అన్ని భాషలు, సంస్కృతులు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్లో 300 ఏళ్ల క్రితం ఎక్కడి నుంచో వచ్చి సెటిల్ అయ్యారని గుర్తు చేశారు.
సమస్యలను పరిష్కరిస్తున్నాం...
ఏపీలో సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో సమస్యలు, బాధలు అనుభవించామని సీఎం కేసీఆర్ తెలిపారు. కరెంట్ కోతల వల్ల గతంలో ఇందిరాపార్క్ దగ్గర హైదరాబాద్ పారిశ్రామిక వేత్తలు ధర్నా చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్లోని బస్తీల్లో మంచినీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. కృష్ణా, గోదావరి నుంచి నీటి సరఫరా పనులు నత్తనడకన నడిచాయన్నారు. అవన్నీ క్లియరెన్స్‌లు సాధించి మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరం పరిశ్రమల రంగంలో డెవలప్ అవుతోందని..ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరుతున్నాయన్నారు. ఎయిర్‌పోర్టులో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిందన్నారు. రెండో రన్ వే కూడా వస్తుందని చెప్పారు. ఆఫీస్ స్పేస్, రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలు సడలించడంతో నిర్మాణం రంగం పుంజుకుందన్నారు. టీఎస్ బీ పాస్ ద్వారా ఆఫీసు స్పేస్లో, రియల్ ఎస్టేట్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు.
మెట్రోను విస్తరిస్తాం..
హైదరాబాద్లో మరిన్ని ప్రాంతాలకు మెట్రోను విస్తరిస్తామనని సీఎం కేసీఆర్ తెలిపారు. బీహెచ్ఈఎల్తో పాటు..నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. . భవిష్యత్లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర సహకారం ఉన్నా..లేకపోయినా..హైదరాబాద్లో మెట్రోను విస్తరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లో నివసించే ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని..అందుకు అనుగుణగా మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లో మెట్రో రైల్ లో రోజూ 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎయిర్ పోర్టు మెట్రో వస్తే మరో 70 వేల మంది ప్రయాణిస్తారని చెప్పారు. రూ. 6250 కోట్లతో 31 కిలో మీటర్ల ఎక్స్ ప్రెస్ మెట్రోను నిర్మించనున్నట్లు తెలిపారు. కాలుష్యం, రద్దీని తగ్గించేందుకే మెట్రోను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, జీఎంఆర్ నిధులతో ప్రారంభం చేసుకున్నామని తెలిపారు.