మోడీజీ.. మీరు, మీ పార్టీ చేస్తుంది తప్పు: కేసీఆర్

మోడీజీ.. మీరు, మీ పార్టీ చేస్తుంది తప్పు: కేసీఆర్

మొయినాబాద్ ఫాంహౌస్ ఫైల్స్ హైకోర్టుతో పాటు ఈడీ, సీబీఐలకు పంపించామని సీఎం కేసీఆర్ తెలిపారు.  సీజేఐ, హైకోర్టు చీఫ్ జస్టిస్ లతో పాటు అన్ని వ్యవస్థలకు పంపిస్తామన్నారు.  ఫాంహౌజ్ ఫైల్స్ మూడుగంటలున్నాయని అందులో బీజేపీ దుర్మార్గానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. గత నెలలో రామచంద్రభారతి పైలట్ రోహిత్ రెడ్డిని కలిశారని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విరోచితంగా కుట్రను బద్దలు కొట్టారన్నారు.  ఈ ముఠాలో మొత్తం 24 మంది ఉన్నారని..అందులో ఉన్న ఒక్కో వ్యక్తికి మూడు ఆథార్ కార్డులు,పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ లు ఉన్నాయన్నారు.  ప్రధాని మోడీ మంచి పనులు చేసి..మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అందుకే ఫామ్ హౌస్ కేసుపై దర్యాప్తు చేయించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. 

8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మోడీ దేశానికి ఏం చేశారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో మీరు ఉంటే.. దేశ ప్రజలను ఎవరు చూసుకుంటారని నిలదీశారు.  ప్రభుత్వాలను కూల్చి ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు.  ఎమ్మెల్యేలను కొని  ప్రభుత్వాలను కూల్చుతామంటే తాము చూస్తూ ఊరుకోవాలా అని కేసీఆర్ నిలదీశారు.  ఎమ్మెల్యేలను కొనేందుకు 24 మంది ఉన్నారట..వారెవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఆ ముఠాలోని తుషార్ అనే వ్యక్తి వయానాడ్ లో రాహుల్ గాంధీపై పోటీ చేశారని కేసీఆర్ తెలిపారు.  ఆయనను అభ్యర్థిగా అమిత్ షానే ప్రకటించారన్నారు. ఫామ్ హౌస్ వీడియోలో చాలా మంది బడా నాయకుల పేర్లు చెప్పారన్నారు. ఇప్పటికే 8 రాష్ట్రాలు కుల్చామని.. త్వరలో  తెలంగాణ, ఢిల్లీ,ఏపీ,రాజస్థాన్ తమ వశం అవుతాయని ఆ వీడియో లో   చెప్పారని వెల్లడించారు. 

ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్ లో జరిగిన సంభాషణను కేసీఆర్ వినిపించారు. తుషార్ అనే వ్యక్తి కేంద్రమంత్రికి సన్నిహితుడు అని చెప్పారు. బీఎఎల్ సంతోష్, అమిత్ షా, జేపీ నడ్డా పేర్లను బ్రోకర్లే చెప్పారన్నారు. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ అన్నారు. బ్రోకర్ల కాల్ డేటా, ల్యాప్ టాప్ డేటా వేల పేజీల్లో ఉందన్నారు. 

ఎమ్మెల్యేలను కొనడానికి అసలు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని కేసీఆర్ ప్రశ్నించారు. ‘‘కర్ణాటక ప్రభుత్వాన్ని కూలగొట్టింది తామే అంటున్నారు.  మొన్న మహారాష్ట్ర సర్కార్ ను కూడా పడగొట్టామంటున్నారు.  ఇంతకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉందా అని కేసీఆర్ ప్రశ్నించారు. భారత న్యాయ వ్యవస్థకు చేతులు జోడించి అడుగుతున్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని కేసీఆర్ వేడుకున్నారు.