దేశ వ్యవసాయరంగం..పెద్ద దిక్కును కోల్పోయింది : సీఎం కేసీఆర్​

దేశ వ్యవసాయరంగం..పెద్ద దిక్కును కోల్పోయింది :  సీఎం కేసీఆర్​

హైదరాబాద్, వెలుగు : ఎంఎస్ స్వామినాథన్​మృతితో దేశ వ్యవసాయరంగం పెద్ద దిక్కును కోల్పోయిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.​ ఆయన మృతిపై గురువారం ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని ఆయన వినూత్న పద్ధతులతో గుణాత్మక దశకు చేర్చారన్నారు. దేశ ప్రజలకు ప్రధాన ఆహారమైన వరి, గోధుమ సహా ఇతర పంటలపై ఆయన అద్భుత ప్రయోగాలు చేశారని, తద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవం సాధించామన్నారు.

ఆయన దేశంలోని ప్రతి రైతు హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తెలంగాణలో వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన కొనియాడారని, ఆయనతో తనకెంతో అనుబంధం ఉందన్నారు. ఒకనాడు కరువు తాండవమాడిన నేలలో నేడు పసిడి పండటం వెనుక ఆయన స్ఫూర్తి ఇమిడి ఉందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్​ప్రగాఢ సానుభూతి తెలిపారు.

స్వామినాథన్​ సేవలు చరిత్రలో నిలిచిపోతాయి : కేటీఆర్

దేశంతో పాటు ప్రపంచ వ్యవసాయ రంగానికి ఎంఎస్ స్వామినాథన్​చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని మంత్రి కేటీఆర్​ఒక ప్రకటనలో తెలిపారు. దేశం ఆహార భద్రత సాధించే దిశగా కృషి చేశారని, దేశ వ్యవసాయ రంగానికి ఆధునిక పద్ధతులు అందించిన మహనీయుడని కొనియాడారు. భారత హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్​మరణం బాధాకరమని మంత్రి హరీశ్​రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆయన మరణం దేశ వ్యవసాయరంగానికి తీరని లోటు అన్నారు. దేశంలోని కోట్లాది మందికి ఆహార భద్రత కల్పించడానికి కృషి చేసిన స్వామినాథన్​ మరణం దేశానికే తీరని లోటు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్​చేశారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటుందన్నారు.