- కాళేశ్వరం విలువ..కష్టకాలంలోనే తెలుస్తది
- ప్రాణహిత, గోదావరిలోకి వచ్చే నీళ్లను వచ్చినట్టే ఎత్తిపోయండి: కేసీఆర్
- తాగు, సాగు నీళ్లకు ఇబ్బందులు రావొద్దు
- సంక్షోభంలో పంటలు పండిస్తేనే మనం సిపాయిలం
- ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు టెస్టింగ్ టైమ్ అధికారులతో రివ్యూలో సీఎం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు విలువ కష్టకాలంలోనే తెలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో తాగు, సాగు నీళ్లకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. ఆదివారం సెక్రటేరియెట్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ ఇంజనీర్లు, ఇతర శాఖల అధికారులతో కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. “కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతగా కష్టపడ్డారో ఇప్పుడూ అదే స్థాయిలో కష్టపడాలి. ప్రాణహిత, గోదావరి ద్వారా వచ్చే నీళ్లను వచ్చినట్టే ఎత్తిపోస్తూ తాగు, సాగు నీళ్లకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారుల మీద ఉన్నది. ఇన్ని రోజులు ఒకెత్తు.. ఇప్పుడు ఒకెత్తు. ఇది ఇరిగేషన్ శాఖకు టెస్టింగ్ టైమ్” అని చెప్పారు.
ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలో లాగా ఆలోచిస్తే కుదరదు. నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నం. సంక్షోభ సమయంలోనూ పంటలు పండించి చూపించాలి. అప్పుడే మనం సిపాయిలం. అందరూ సమన్వయం చేసుకుంటూ, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. ఈ ఏడాది అనుభవం భవిష్యత్ తెలంగాణకు ఉపయోగపడుతుంది. ఎక్కడి ఈఎన్సీలు అక్కడే ఉండి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నీరు అందించడమే లక్ష్యంగా నిరంతరం ఏకాగ్రతతో పని చేయాలి. ఇందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలి” అని సూచించారు.
జెన్ కోకు పంప్ హౌస్‌ల నిర్వహణ
తాగు నీటి అవసరాలకు సమస్య రాకుండా ఎప్పటికప్పుడు చెక్‌చేసుకోవాలని అధికారులకు కేసీఆర్ సూచించారు. ‘‘ఉదయ సముద్రం, కోయిల్ సాగర్ లో కొంత నీటి కొరత ఉంది. వాటిలో నీటి నిల్వలు పెంచుకోవాలి. పంపు హౌస్‌ల నిర్వహణను ప్రైవేట్కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా జెన్కోకు ఇచ్చేలా విధివిధానాలు ఖరారు చేయాలి. పాలేరుకు ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వచ్చే అవకాశం లేదు. గోదావరి నుంచి ప్రవాహం రాకున్నా ప్రాణహిత నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎత్తిపోసేలా మోటార్లను నిరంతరం నడిపించాలి. సుందిళ్ల నుంచి ఎత్తిపోసే ఒక టీఎంసీలో అర టీఎంసీ మిడ్‌మానేరుకు, ఇంకో అర టీఎంసీ వరద కాల్వ, ఎస్సారెస్పీ పునరుజ్జీవం ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలి. కాళేశ్వరం నీళ్లను తుంగతుర్తి మీదుగా సూర్యాపేట చివరి ఆయకట్టు సీతారాం తండా దాకా అందించాలి” అని ఆదేశించారు.
ప్రతిరోజూ సీఎంవోకు రిపోర్టు పంపాలె..
ప్రస్తుత కష్టకాలంలో రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని కేసీఆర్ సూచించారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు, వ్యవసాయాన్ని కాపాడుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ‘‘మొదట కురిసిన వర్షాలకు రైతులు పత్తి, ఇతర విత్తనాలు నాటారు. అయితే వర్షాభావంతో అవి మొలకెత్తకుండా ఎండిపోయాయి. రైతులు తిరిగి విత్తనాలు వేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారికి ఎరువులు అందించేలా ప్లాన్సిద్ధం చేసుకోవాలి” అని అధికారులకు సూచించారు. ‘‘రాష్ట్రంలో వర్షాలు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, కరెంట్లభ్యత, పంటలు, వాటికి కావాల్సిన ఎరువులు ఇతర అవసరాలపై ప్రతి రోజు మినిట్టు మినిట్రిపోర్టు సీఎంవోకు పంపించాలి. ఆ రిపోర్టుల ఆధారంగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను సీఎంవో అలర్ట్చేస్తూ ఎలాంటి సమస్య లేకుండా సమన్వయం చేస్తుంది” అని చెప్పారు. సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సీఎస్శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.