మే 31 వరకే వడ్ల కొనుగోళ్లు

మే 31 వరకే వడ్ల కొనుగోళ్లు

హైదరాబాద్‌, వెలుగు:  మే 31 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడపాలని, రైతులు కూడా ఆలోగానే తమ వడ్లు అమ్ముకోవాలని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. ఈ నెల  31 తర్వాత  కొనుగోలు కేంద్రాలు నిలిపివేయాలన్నారు. అగ్రికల్చర్  ఆఫీసర్లు, రైతుబంధు సమితుల ప్రతినిధులు జూన్ 1 నుంచి వానాకాలం పంటల సాగుపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. వానాకాలంలో ఏ పంటలు వేయాల్నో  రైతులకు అగ్రికల్చర్​ ఆఫీసర్లు తగిన సూచనలు ఇవ్వాలని, సూచించిన పంటల విత్తనాలు శుక్రవారం రాత్రిలోగా ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని బుధవారం ప్రగతి భవన్​లో జరిగిన వ్యవసాయ సమీక్షలో సీఎం ఆదేశించారు. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలు వేయాలని ప్రభుత్వం రైతులకు సూచించిందని, నిరుడు వానాకాలంలో వేసిన పంటలతో పోలిస్తే పెద్దగా మార్పులేమీ లేవని ఆయన అన్నారు. ఈ వానాకాలంలో మక్క వేయొద్దని, దాని ప్లేస్​లో కందులు లేదా పత్తి పంట వేయాలని కోరినట్లు చెప్పారు. ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరించేందుకు రైతులు ముందుకు వస్తున్నారని అన్నారు.

సాదాసీదాగా రాష్ట్ర అవతరణ వేడుకలు

జూన్​ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను లాక్‌డౌన్‌  కారణంగా సాదాసీదాగా నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. అమరవీరులకు నివాళులర్పించడం, జెండా వందనాలకే వేడుకలు పరిమితం చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వారి ఆఫీసుల్లోనే జెండాలు ఎగురవేస్తారని ఆయన చెప్పారు. ఆరోజు సీఎం కేసీఆర్‌ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ప్రగతి భవన్‌లో జెండా ఎగురవేస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు ఇలాగే జెండా ఎగుర వేస్తారు.

హైదరాబాద్​లో అన్ని షాపులు ఓపెన్​

హైదరాబాద్‌లో గురువారం నుంచి మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి సీఎం కేసీఆర్​ ఓకే చెప్పారు. బుధవారం వరకు షాపులు తెరిచేందుకు సరి–బేసి విధానం అమలులో ఉండగా.. ఇక నుంచి ఆ విధానం ఉండదు. మాల్స్​ తప్ప అన్ని షాపులు తెరుచుకోవచ్చు. షాపుల ముందు ఎక్కువ మంది జనం పోగుకాకుండా ఆయా షాపుల యజమానులు రూల్స్​ పాటించాలని సీఎం సూచించారు.

జూన్‌ ఒకటి నుంచి శానిటేషన్‌ డ్రైవ్‌

రాష్ట్రంలోని అన్ని ఊళ్లు, పట్టణాల్లో జూన్‌ ఒకటి నుంచి 8 వరకు వరకు శానిటేషన్​ డ్రైవ్​ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు వ్యాప్తిచెందకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. డ్రైనేజీలు శుభ్రం చేసి వాననీరు ఆగకుండా చర్యలు చేపట్టాలని, గుంతలు పూడ్చేయాలని, రోడ్లపై నీళ్లు నిల్వకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జనం ఉండే ప్రాంతాల్లో ఫాగింగ్‌ చేయాలని, బైటాక్స్‌ స్ప్రే చేయాలని, ఆయిల్‌ బాల్స్‌ వేయాలన్నారు.