వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ ఆధిక్యత ఉంటుంది. అభివృద్ధి జరిగే కొద్దీ వ్యవసాయ వాటా తగ్గి పారిశ్రామికరంగం వాటా పెరుగుతుంది. పరిశ్రమలు అభివృద్ధి చెందే కొద్దీ బ్యాంకింగ్, బీమా, రవాణా, సేవలు అభివృద్ధి చెందుతాయి. ఇందులో సేవా రంగ ఆధిపత్యం అనేది మూడో దశలో కనిపిస్తుంది. మనదేశంలో వ్యవసాయ ఆధిక్యత, సేవారంగం ఆధిక్యతగా మారింది. అంటే పారిశ్రామిక దశ దాటి వేసింది.
భారత ఆర్థిక వ్యవస్థలో అధిక వృద్ధి నమోదు కావడానికి సేవారంగ వృద్ధి ప్రధాన కారణం. 1950–90 మధ్య పరిశ్రమల కంటే సేవల వృద్ధి నెమ్మదిగా సాగింది. 1980లో పుంజుకుని 1990 నుంచి వేగాన్ని అందుకున్నది. 9వ ప్రణాళికలో దేశ వృద్ధిరేటు తక్కువగా నమోదయినప్పటికీ సేవల వృద్ధి రేటు ఎక్కువగానే నమోదైంది. 10, 11వ ప్రణాళికల్లో సేవారంగంలో మంచి వృద్ధి నమోదైంది. 12వ ప్రణాళికలో కూడా వ్యవసాయ, పారిశ్రమిక రంగాల కంటే సేవా రంగంలో ఎక్కువ వృద్ధి నమోదైంది. 1951–52లో జీడీపీ వృద్ధిలో సేవా రంగం వాటా 29.6 శాతం కాగా, 2014–15 నుంచి 2020–21 మధ్య సేవల వాటా 61.1 శాతంగా ఉన్నది.
ఐసీటీ
సేవారంగ సత్వర వృద్ధికి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) కూడా ఒక కారకం. ఎలక్ట్రానిక్స్‌లో నవకల్పన, కంప్యూటింగ్ (హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్వేర్), టెలికమ్యూనికేషన్లు, మైక్రో ప్రాసెసర్లు, సెమీ కండక్టర్లు, ఫైబర్ ఆప్టిక్స్ మొదలైనవి ఐసీటీలో భాగమే. ఐసీటీ అనువర్తితాల వల్ల సేవలు మెరుగుపడతాయి. నూతన అవకాశాలు సృష్టిస్తాయి. ఐసీటీ అనేది వ్యవహారాల వ్యయాన్ని తగ్గిస్తుంది. కాల, స్థల అడ్డంకులను తొలగిస్తుంది. పారిశ్రామిక కాలంలో సమాచారాన్ని పొందడం, రవాణా, వ్యాపారం అధిక ఖరీదుగా ఉండేవి. కానీ ప్రస్తుత నెట్వర్క్ కాలంలో సమాచార వ్యయం చాలా తక్కువగా ఉన్నది.
ఐటీ పరిశ్రమ
మన దేశంలో 1984లో న్యూ కంప్యూటర్ పాలసీ (ఎన్సీపీ) ప్రకటించారు. ఈ పాలసీ ప్రకారం మొదటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ (ఎస్ టీపీఐ)ను బెంగళూరులో ఏర్పాటు చేశారు. ముంబాయితో పోలిస్తే శ్రామిక వ్యయం తక్కువ ఉండటం, దక్షిణ భారతదేశానికి మధ్యగా ఉండటం, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేయడం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) వంటి సంస్థలు ఉండటం వల్ల ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చాలా ఐటీ కంపెనీలు బెంగళూరుకు బదిలీ అయ్యాయి. తర్వాత ఎస్టీపీఐలు హైదరాబాద్, పుణె, కోలకత్తా, చెన్నై, మైసూర్, నోయిడా, మొహాలీ, గాంధీనగర్, ముంబయి, తిరువనంతపురం వంటి నగరాల్లో ఏర్పడ్డాయి. 2000లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్టును తీసుకువచ్చారు.
బీపీఓ (బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్)
డేటా ఎంట్రీ, మెడికల్ ట్రాన్స్ క్రిప్షన్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, కాల్ సెంటర్స్, డేటా బేస్ సర్వీసెస్ మొదలైనవి బీపీఓలోకి వస్తాయి. మన దేశంలో విద్యావంతులు, నైపుణ్యం గల శ్రామికులు, ఇంగ్లిష్ మాట్లాడేవారు, తక్కువ జీతాలకు పనిచేసేవారు అధికంగా ఉండటం వల్ల సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నాయి. నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (కేపీఓ) అభివృద్ధి ప్రారంభ స్థాయిలో ఉన్నది. ఇది అధిక విలువ కలిగిన సేవలకు చెందింది. అధిక స్థాయి బిజినెస్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్‌ను నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్ అంటారు.
►ALSO READ | బీటెక్ పాసైతే చాలు IITH లో మంచి జాబ్స్.. జీతం రూ. 50 వేలు
కంప్యూటర్ సమాచార సేవల ఎగుమతులు అత్యధికంగా యురోపియన్ యూనియన్ చేయగా, రెండో స్థానంలో ఇండియా ఉన్నది. అయితే, ఈ మధ్యకాలంలో చైనా, ఇజ్రాయెల్, ఫిలిపైన్స్ నుంచి మన దేశానికి పోటీ ఎదురవుతున్నది.
ఐటీ – బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్)
ఈ మధ్యకాలంలో ఐటీ – బీపీఎం వేగంగా వృద్ధి చెందుతున్నది. 2021–22లో 200 బిలియన్ డాలర్ల రాబడిని అధిగమించి 227 బిలియన్ల అమెరికా డాలర్లకు చేరింది. 2026 నాటికి 350 బిలియన్ల డాలర్ల ఆదాయానికి చేరాలనేది లక్ష్యం. భారత ఐటీ పరిశ్రమ 50 లక్షలకు పైగా ఉపాధిని అందిస్తున్నాయి. ఇందులో అధిక ఉపాధిని ఐటీ – బీపీఎం రంగం అందిస్తున్నది. మహిళలు, విదేశీయులకు కూడా ఎక్కువగా పని కల్పిస్తున్నాయి. భారత ఐటీ ఎగుమతులకు మార్కెట్‌ను ఎక్కువగా కల్పించేది అమెరికా, రెండోది ఇంగ్లండ్.
సంస్కరణల తర్వాత సేవారంగ వృద్ధిరేటు వేగంగా ఉన్నప్పటికీ ఉపాధిలో వాటా మాత్రం తక్కువగానే ఉన్నది. 2020–21 (పీఈ) జీవీఏలో సేవల వాటా 54 శాతం అయినప్పటికీ 2016లో ఉపాధిలో సేవల వాటా 30.6 శాతం మాత్రమే. అంటే సంస్కరణల తర్వాత ఉపాధి రహిత సేవారంగ వృద్ధి కనిపిస్తున్నది. ఉత్పత్తిలో సేవారంగ వృద్ధి కంటే ఉపాధిలో సేవల వృద్ధి తక్కువగా ఉన్నది.
