పర్సనల్ ఫైనాన్స్ ప్రపంచంలో బాగా పాపులర్ అయిన పెట్టుబడి ఫార్ములా '15×15×15'. దీని ప్రకారం ఎవరైనా వ్యక్తి నెలకు రూ.15వేల పెట్టుబడిని, 15 ఏళ్ల కాలపరిమితి, 15 శాతం వార్షిక రాబడితో కొనసాగిస్తే వారి పెట్టుబడి కోటి రూపాయలు అవుతుందని ఇది చెబుతోంది. వినడానికి ఇది చాలా సులభంగా.. ఆకర్షణీయంగా అనిపిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టినప్పటికీ, చాలామంది ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ రూల్ ఆధారపడిన కండిషన్స్.. వాస్తవ మార్కెట్ ఒకేలా ఉండకపోవటమే.
ఈ ఫార్ములాలోని 3 ప్రధాన తప్పిదాల గురించి ఇప్పుడు తెలుసుకుందా. అప్పుడే అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో ఇన్వెస్టర్లకు కూడా అర్థం అవుతుంది.
1. 15% రాబడి అన్నది రూల్ కాదు.. ఒక అరుదైన మినహాయింపు:
కాగితాలపై వేసే లెక్కల్లో 15 శాతం రాబడితో కోటి రూపాయలు కనిపిస్తాయి. కానీ గత 20 ఏళ్ల నిఫ్టీ 500 డేటాను పరిశీలిస్తే.. 15 ఏళ్ల కాలపరిమితిలో 15 శాతం కంటే ఎక్కువ రాబడి వచ్చింది కేవలం 10.6 శాతం సందర్భాల్లో మాత్రమే. దాదాపు 40 శాతం సమయాల్లో రాబడి 12 శాతం కంటే తక్కువగానే ఉంది. ఒకవేళ మీకు 15 శాతానికి బదులు 12 శాతం రాబడి వస్తే.. పెట్టుబడి ద్వారా సంపద రూ.కోటి కాకుండా కేవలం రూ.75 లక్షలు మాత్రమే అవుతుంది. అంటే కేవలం 3 శాతం రాబడి వ్యత్యాసంతో ఇన్వెస్టర్లు రూ. 25 లక్షలు నష్టపోతారు.
2. రిస్క్ పెంచితే రాబడి పెరుగుతుందనుకోవడం భ్రమ:
చాలామంది 15 శాతం రాబడి కోసం స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ గత డేటా ప్రకారం.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 15 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది కేవలం 25 శాతం సందర్భాల్లోనే. మిగిలిన 50 శాతం సమయాల్లో రాబడి 12 శాతం లోపే ఉంది. అధిక రాబడి కోసం రిస్క్ తీసుకుంటే.. మార్కెట్ పతనమైనప్పుడు భయంతో ప్యానిక్ సెల్లింగ్ కారణంగా పెట్టుబడులను మధ్యలోనే నిలిపివేసే ప్రమాదం ఉంటుంది.
3. ద్రవ్యోల్బణం నిశ్శబ్ద శత్రువు:
ఇన్వెస్టర్లు కష్టపడి 15 ఏళ్ల తర్వాత రూ. కోటి వస్తుందని భావిస్తుంటారు. కానీ అప్పటికి ఆ కోటి రూపాయల విలువ నేటి కోటి రూపాయలతో సమానం కాదని చాలా మందికి తెలియదు. 6 శాతం ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే.. ఇప్పటి రూ.42 లక్షలతో ఏవైతే వస్తువులు వస్తాయో.. 15 ఏళ్ల తర్వాత కోటి రూపాయలతో అవే వస్తాయి. అంటే మీ లక్ష్యం నెరవేరినా అప్పటి అవసరాలకు ఆ డబ్బు సరిపోకపోవచ్చు.
►ALSO READ | ఎయిర్‌పోర్ట్ బిజినెస్‌లో.. అదానీ రూ.లక్ష కోట్ల పెట్టుబడి
పెట్టుబడిదారులు15×15×15 రూల్‌ను ఒక ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే వాడుకోవాలి. కేవలం అంకెలను నమ్మకుండా.. మీ జీతం పెరిగే కొద్దీ SIP మొత్తాన్ని పెంచుకుంటూ వాస్తవిక రాబడిని (10-12%) అంచనా వేస్తూ ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. సంపద సృష్టి అనేది కేవలం ఒక ఫార్ములా కాదు. అది మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సాగాల్సిన ప్రయాణం అని అర్థం చేసుకున్నప్పుడు అసలైన విజయం మిమ్మల్ని వరిస్తుంది.
