నాలుగేండ్లలోనే దళిత వాడలన్నీ బంగారు మేడలైతయ్

నాలుగేండ్లలోనే దళిత వాడలన్నీ బంగారు మేడలైతయ్

కరోనా కారణంగా ఏడాది ఆలస్యంగా దళిత బంధు ప్రారంభం అవుతోందని, ఈ స్కీమ్‌ను విజయవంతం చేసి చూపిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ బాధ్యత దళిత బంధు అందుకునే లబ్ధిదారులుపైనా ఉందన్నారు. దళితులమే కానీ, దరిద్రులం కాదని రుజువు చేయాలని చెప్పారు. సమగ్ర సర్వే ప్రకారం హుజురాబాద్‌లో 21 వేల మంది దళిత కుటుంబాలు ఉన్నాయని, ప్రతి ఫ్యామిలీకి ఈ స్కీమ్ అందిస్తామని కేసీఆర్ తెలిపారు. 15 రోజుల్లో రూ.2 వేల కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. మూడు నాలుగేండ్లలోనే దళిత వాడల్నీ బంగారపు మేడలవుతాయని అన్నారు. డబ్బులకు ఇబ్బంది లేదని,  అవసరమైతే లక్షా 50 వేల కోట్ల రూపాయలైనా ఇచ్చేందుకు సిద్ధమమని, ఏడాదికో 40 వేల కోట్ల చొప్పున ఇస్తూ పోతే మన వాడలన్నీ  బంగారు మేడలు కావాలని, కవి గోరెటి వెంకన్న రాసిన మాటను నిజం చేయాలని చెప్పారు.

దళిత బంధు స్కీమ్‌ ద్వారా అందే రూ.10 లక్షలకు మళ్లీ కిస్తీలు కట్టే పని లేదని, ఈ డబ్బులతో వ్యాపారాలు పెట్టుకుని ఆర్థికంగా ఎదగాలని సీఎం కేసీఆర్ సూచించారు.  ఇవాళ  హుజురాబాద్ లోని శాలపల్లి ఇందిరానగర్ లో నిర్వహించిన దళిత బంధు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఇప్పటి వరకు దళితులకు అవకాశాలు లేకనే వెనకబడి ఉన్నారు కానీ, సరైన అవకాశాలు వస్తే గొప్పగా ఎదుగుతామని రుజువు చేయాలని కోరారు. దళితులమే కానీ దరిద్రులం కాదని ప్రపంచానికి తెలసేలా చేయాలని, దళిత బంధు డబ్బులతో హుజురాబాద్‌, జమ్మికుంటలోనే కాదు, హైదరాబాద్‌కు వచ్చి కూడా వ్యాపారాలు, షాపులు పెట్టుకుని ఎదగవచ్చిని చెప్పారు. దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అన్నారు. ఆయన తన ప్రసంగం ముగిసిన తర్వాత స్కీమ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.