నాలుగేండ్లలో రాష్ట్రమంతా దళితబంధు

నాలుగేండ్లలో రాష్ట్రమంతా దళితబంధు
  • నెల, రెండు నెలల్లో హుజూరాబాద్​లో పూర్తి: సీఎం
  • ‘రైతుబంధు’ లెక్కనే ప్రతి దళిత కుటుంబానికీ ఇస్తం
  • గవర్నమెంట్‍ ఉద్యోగులకూ వర్తిస్తది
  • రాబోయే 15 రోజుల్లో రూ. 2 వేల కోట్లు రిలీజ్‍ చేస్తం
  • ఈ స్కీంతో అన్నిరాష్ట్రాల్లో అగ్గి రగుల్తది
  • మెడికల్‍ షాపులు, వైన్స్​ల్లోనూ దళితులకు రిజర్వేషన్‍ 
  • రాహుల్‍ బొజ్జా ఇకనుంచి సీఎం ఆఫీస్‍ సెక్రటరీ
  • హుజూరాబాద్​లో దళిత బంధు పథకం 
  • ప్రారంభోత్సవ సభలో కేసీఆర్‍ ప్రకటన

కరీంనగర్​/వరంగల్‍, వెలుగు: రాబోయే మూడు నాలుగేండ్లలో రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు స్కీం అమలు చేస్తామని సీఎం కేసీఆర్‍ చెప్పారు. వాళ్లు, వీళ్లు, గవర్నమెంట్​ ఉద్యోగులు అనే తేడా లేకుండా రైతు బంధు తరహాలోనే  ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఈ స్కీం వర్తింపజేస్తామని, రూ. 10 లక్షల చొప్పున అందజేస్తామని తెలిపారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 17 లక్షలకు పైగా దళిత కుటుంబాలున్నాయని, స్కీం అమలుకు మహా అంటే రూ. లక్షా 70 వేల కోట్లు ఖర్చు అవుతాయని, ఏడాదికి రూ. 30 వేల కోట్ల నుంచి 40 వేల కోట్లు ఇచ్చినా రాబోయే మూడునాలుగేండ్లలో దళిత వాడలన్నీ మేడలవుతాయని ఆయన ​ చెప్పారు.  

హుజూరాబాద్​ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క దళిత కుటుంబానికి నెల, రెండు నెలల్లో రూ. 10 లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించారు. సోమవారం కరీంనగర్‍ జిల్లా హుజూరాబాద్‍ నియోజకవర్గంలోని శాలపల్లిలో దళితబంధు పథకాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా15 మందికి స్కీం మంజూరు పత్రాలు, ఐడీ కార్డులు అందజేశారు. అనంతరం కేసీఆర్​ మాట్లాడుతూ.. దళితబంధు ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది ఒక మహా ఉద్యమమని.. కచ్చితంగా విజయం సాధించి తీరుతుందన్నారు. ఏడాది కిందటే దీనిని అమలు చేద్దామనుకున్నామని, కరోనా వల్ల లేట్‍ అయిందని చెప్పారు. గతంలో హుజూరాబాద్‍ కేంద్రంగా రైతుబంధు, కరీంనగర్‍లో రైతుబీమా ప్రారంభించామని, అదే సెంటిమెంట్‍తో హుజూరాబాద్‍లోనే దళితబంధు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సభలో జై దళిత బంధు..జై భీమ్‍ అంటూ కేసీఆర్​ నినాదాలు చేశారు.

హుజూరాబాద్‍ ఓ ప్రయోగ శాల
దళిత బంధు అమలుకు హుజూరాబాద్‍ ఓ ప్రయోగశాల అని కేసీఆర్ ​అన్నారు. ఇక్కడి సక్సెస్‍, ఫెయిల్యూర్‍ ఆధారంగానే మిగతా 118 నియోజకవర్గాల్లో స్కీం విజయవంతంగా అమలు చేయాల్సి ఉంటుందని, అది సీఎంగా తన ముందున్న చాలెంజ్‍  అని, అందువల్లే మెజార్టీ మంత్రులంతా సభకు వచ్చారని ఆయన తెలిపారు. ‘‘ఈ పథకం ఏంటి.. దాని ఉద్దేశమేంటి.. ఎలా అమలు చేస్తరు. మనం కూడా మన జిల్లాలు, నియోజకవర్గాల్లో ఎలా అమలు చేయాలో.. తెలుసుకోవడానికే వాళ్లంతా హుజూరాబాద్‍ వచ్చిండ్రు” అని అన్నారు. మళ్లీ 20 రోజుల్లో తాను హుజూరాబాద్‍ వస్తానని, దళిత వాడల్లో తిరగడం ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని సీఎం చెప్పారు. స్టేట్‍ ఎస్సీ వెల్ఫేర్‍ సెక్రటరీగా పని చేస్తున్న రాహుల్‍ బొజ్జా కూడా దళితుడేనని, ఇక నుంచి ఆయన సీఎం ఆఫీస్​ సెక్రటరీగా ఉంటారని  కేసీఆర్‍ ప్రకటించారు. ‘రేపటి నుంచే నా కార్యాలయంలో.. నా సెక్రటరీగా ఉంటడు” అన్నారు. కరీంనగర్‍ కలెక్టర్​ కర్ణన్‍ బాగా పని చేసిండు కాబట్టే ఈ ఉద్యమాన్ని గొప్పగా ముందుకు తీసుకుపోయే ఓపికమంతుడికి జిల్లాలో పోస్టింగ్​ ఇచ్చామని తెలిపారు. 

ఇక అన్ని రాష్ట్రాల్లోనూ అగ్గి రగుల్తది
దేశంలోని దళిత ఉద్యమాలకు హుజూరాబాద్‍ కేరాఫ్‍ అవ్వాలని కేసీఆర్‍ అన్నారు. అంబేడ్కర్‍ ముందుచూపుతో కొందరికి ఉద్యోగ, ఉపాధి ఆవకాశాలు దొరికినా.. నూటికి 95 శాతం మంది పేదరికంలో ఉన్నారని చెప్పారు. 75 ఏండ్లుగా ఎందరో పీఎంలు, సీఎంలు వచ్చినా.. ఎన్నో పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చినా ఇలాంటి దళిత బంధు లాంటి స్కీం ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఎవరు చేయలేని పని తాను తెలంగాణలో మొదలుపెట్టినట్లు చెప్పారు. ‘‘ఇక్కడ స్కీం అమలు ద్వారా దేశ దళిత జాతి మేలుకుంటుంది. వాళ్లకు ఉద్యమ స్ఫూర్తి వస్తది. అన్ని రాష్ట్రాల్లో అగ్గి రగులుకుంటది. దేశం మొత్తం పిడికిలి ఎత్తి.. తెలంగాణలో జరిగిందెట్లా.. తమ రాష్ట్రాల్లో ఎందుకు జరగట్లేదో అడుగుతది. మొత్తం భారత దళిత జాతికి మంచి జరుగుతది. ఇక్కడ జరిగిందంటే.. ఈ ఉద్యమం చెలరేగిందంటే ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం కనపడుతది. అదే హుజూరాబాద్‍ సాధించిన విజయం అవుతుంది’’ అని కేసీఆర్​ అన్నారు. తన మాదిరి ఆలోచనలు ఎవ్వరికీ రాకుండా.. తాను పెట్టిన పథకాలు భవిష్యత్తులో ఎవ్వడూ తీసెయ్యకుండా అడుగులు వేస్తున్నానని ఆయన చెప్పారు. దళిత బంధు పథకం ఆలోచన ఇయ్యాల పుట్టింది కాదని, సిద్దిపేటలో 25 ఏండ్ల కిందనే ఎమ్మెల్యేగా 'దళిత చైతన్య జ్యోతి' స్కీం పెట్టానని, దళితుడైన తన మిత్రుడు దానయ్యను మార్కెట్‍ కమిటీ చైర్మన్‍ చేశానని తెలిపారు. 

దళిత రక్షణ నిధి.. 1.25 లక్షల సైన్యం 
దళితులకు సెక్యూరిటీగా ‘దళిత రక్షణ నిధి’ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. స్కీం ద్వారా ఇచ్చే రూ.10 లక్షల్లో 10 వేలు పక్కనపెట్టి..  దానికి ప్రభుత్వం మరిన్ని డబ్బులు కలిపి నిధి ఏర్పాటు చేస్తుందన్నారు. హుజూరాబాద్‍లో 25 వేల కుటుంబాల నుంచి కట్‍ చేసిన రూ. 10 వేలతో రూ. 25 కోట్లు అవుతాయని.. ప్రభుత్వం మరో రూ.25 కోట్లు కలిపి రూ. 50 కోట్లతో హుజూరాబాద్‍ దళితులకు రక్షణ నిధి ఏర్పాటు చేస్తుందన్నారు.  ఊరికి ఆరుగురు, మండలానికి 15 మంది, నియోజకవర్గానికి 24 మంది.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల దళిత సైన్యం ఏర్పాటు చేసి దళిత రక్షణ నిధి పనిచేసేలా చూస్తామన్నారు. 

ప్రభుత్వ ఉద్యోగులకూ రూ. 10 లక్షలు 
రైతుబంధు స్కీం మాదిరే దళితబంధు పథకాన్ని ప్రభుత్వ దళిత ఉద్యోగులకు కూడా వర్తింపచేస్తామని సీఎం చెప్పారు. ‘‘భూమి లేనోళ్లు,  ఉండడానికి ఇండ్లు లేనోళ్లు, అప్పులు ఉన్నవాళ్లకు మొదటివరుసలో దళిత బంధు ఇస్తం. ఇంకొద్దిగా మంచిగున్నోళ్లకు రెండో వరుసలో.. జర నయం అనిపించేటోళ్లకు మూడో వరుసలో ఇచ్చి.. చివరిగా ఎంప్లాయీస్‍కు ఇస్తం”అని ప్రకటించారు. దళితబంధు అనగానే కొందరు కిరికిరిగాళ్లు కొండి కొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘తీసుకునేటోళ్లకు, ఇచ్చేటోళ్లకు లేని బాధ మధ్యలో ఉన్నోళ్లకు ఎందుకు?  రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువుంటదా. స్కీంకు నేను నిధులు కేటాయిస్త” అని చెప్పారు. దళిత బంధు పథకం కింద హుజూరాబాద్​ నియోజకవర్గానికి ఇప్పటికే రూ. 500 కోట్లు మంజూరు చేశామని, రాబోయే 15 రోజుల్లోనే ఇంకో రూ. 2 వేల కోట్లు రిలీజ్‍ చేస్తామన్నారు. దళిత బంధు తీసుకున్నా.. రేషన్‍కార్డు, పెన్షన్లు అన్ని కొనసాగుతాయని చెప్పారు. 

మెడికల్‍, బార్‍, వైన్‍ షాపుల్లోనూ రిజర్వేషన్‍ 
దళితులకు అన్నింట్లో రిజర్వేషన్‍ పెట్టినట్లే మెడికల్‍ షాపులు, బార్లు, వైన్స్ కేటాయింపుల్లోనూ రిజర్వేషన్‍ పెట్టనున్నట్లు సీఎం తెలిపారు. దళితు లు పెట్టుకునే బిజినెస్‍లు  హుజూరా బాద్‍, జమ్మికుంట, వీణవంకలోనే పెట్టుకోవాలనేం లేదని వరంగల్‍, కరీంనగర్‍, హైదరాబాద్​లో ఎక్కడైనా పెట్టుకోవచ్చని చెప్పారు. రూ.10 లక్షలను ఎలా వాడుకోవాలో తెలియని వాళ్లు కలెక్టర్ల సలహాలు తీసుకోవాలని సూచించారు.

‘తెలంగాణ దళిత బంధు’ పేరుతో బ్యాంక్‍ అకౌంట్‍
దళితబంధు స్కీం కోసం అందరూ కొత్త బ్యాంక్‍ అకౌంట్లు ఓపెన్‍ చేయాలని కేసీఆర్‍  తెలిపారు. పాత అకౌంట్లలో వేస్తే పాత బాకీలు కట్‍ అయ్యే అవకాశముందన్నారు. ఈ డబ్బులన్నీ కొత్త అకౌంట్లలోనే వేసుకోవాలని చెప్పారు. ‘తెలంగాణ దళిత బంధు’ పేరుతో కలెక్టర్లు ఆ పని చేసిపెడతారని  చెప్పారు. ‘‘దళితబంధు కార్డ్​లోని ఎలక్ట్రానిక్‍ చిప్‍ ద్వారా మీకిచ్చిన డబ్బులతో మీరు ఏం పెట్టారు.. అది ఎంత విజయవంతంగా ఉందో కలెక్టర్లు పర్యవేక్షణ చేస్తరు” అని సీఎం కేసీఆర్‌‌ అన్నారు.