విశ్వ క్రీడల్లో మరిన్ని పతకాలు సాధించాలి

విశ్వ క్రీడల్లో మరిన్ని పతకాలు సాధించాలి

హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశ క్రీడాకారులు హాకీ, బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.  సుమారు 41 ఏండ్ల తర్వాత భారత హాకీ జట్టు విశ్వక్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. తద్వారా దేశీయ క్రీడ హాకీ విశ్వక్రీడా వేదికల్లో పునర్వైభవాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు తీవ్రంగా కృషి చేసిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్‌ను, జట్టు క్రీడాకారులను సీఎం ప్రశంసించారు. మహిళా బాక్సింగ్ కేటగిరీలో తొలిసారి బరిలోకి దిగి కాంస్యం సాధించిన అస్సాంకు చెందిన భారత బాక్సర్‌ లవ్లీనా బొర్గోహైని సీఎం కేసీఆర్ అభినందించారు. ఒలింపిక్స్‌లో దేశం తరఫున పతకం నెగ్గిన మూడో బాక్సర్‌గా లవ్లీనా చరిత్రకెక్కడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ భారత క్రీడాకారులు విశ్వ క్రీడల్లో విజయకేతనం ఎగరేసి మరిన్ని పతకాలు సాధించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.