
సమావేశాలపై మంత్రులు, విప్‌లతో సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ‘అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై పూర్తిగా చర్చ జరగాలి. ఎన్ని రోజులైనా సమావేశాలు నిర్వహించుకుందం. అన్ని పార్టీలు లేవనెత్తిన అంశాలపై చర్చ జరుగుతుంది. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు మంత్రులు సిద్ధం కావాలి’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ నెల 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, విప్‌లతో గురువారం ప్రగతి భవన్‌లో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి, నివారణ, బాధితులకు వైద్యం, రాష్ట్రంలో హెల్త్ సిస్టమ్, భారీ వర్షాలతో పంట నష్టం, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం, కొత్త రెవెన్యూ చట్టం, ఏపీ కడుతున్న అక్రమ ప్రాజెక్టులు, జీఎస్టీ అమలులో అన్యాయం, కేంద్ర ఆర్థిక విధానాలతో కలుగుతున్న నష్టం, నియంత్రిత సాగు, పీవీ శతజయంతి ఉత్సవాలు తదితర అంశాలపై చర్చించాలని, ప్రభుత్వ పరంగా చర్చకు సిద్ధమైన అంశాలను బీఏసీ సమావేశంలో ప్రతిపాదించాలని నిర్ణయించారు.
సభలో నిందలు, పనికిమాలిన తిట్లొద్దు
అసెంబ్లీలో అల్లర్లు, తిట్లు, పనికిమాలిన నిందలు వద్దని.. ఈ విషయంలో మార్పు రావాలని కేసీఆర్ అన్నారు. చర్చలు గొప్పగా, అర్థవంతంగా జరగాలన్నారు. జనానికి ఉపయోగపడేలా సభ్యులు మాట్లాడాలని సూచించారు. ‘ఏ పార్టీ సభ్యులైనా, ఏ విషయంపైనైనా సభలో మాట్లాడొచ్చు. సమాధానం చెప్పడానికి, వివరణ ఇవ్వడానికి, సూచనలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధం’ అన్నారు.
7 న టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్
ఈ నెల 7 న సాయంత్రం 5 గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సి వ్యుహాలపై సమావేశంలో చర్చించనున్నట్లు గురువారం పార్టీ వెల్లడించింది.