హైదరాబాద్- రాష్ట్రంలో శనివారం నాటికి మొత్తం 503 కరోనా పాజిటి కేసులు నమోదయ్యాయని తెలిపారు సీఎం కేసీఆర్. ఈ రోజు మరో 16 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. ఇద్దరు మృతి చెందారన్నారు. యాక్టివ్ పాజిటివ్ కేసులు 393 ఉండగా.. 96 మంది డిశ్చార్జి అయ్యారని.. 14 మంది చనిపోయినట్లు తెలిపారు. కేబినెట్ మీటింగ్ తర్వాత ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన కేసీఆర్.. కరోనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. లాక్ డౌన్ ఏప్రిల్ – 30 వరకు పొడిగించినట్లు తెలిపారు సీఎం కేసీఆర్. ఈ క్రమంలోనే తెలంగాణ క్యాబినెట్ దీనికి ఆమోదించిందన్నారు.
పలు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని.. కరోనా నివారణ చర్యలు, రాష్ట్రాల్లో పరిస్థితులపై పీఎం సమీక్ష చేపట్టారన్నారు. అదేవిధంగా లాక్ డౌన్ కొనసాగింపుపై సీఎంల అభిప్రాయాలను తెలుసుకున్నారని… ఈ క్రమంలోనే లాక్ డౌన్ ను మరో 2 వారాలు పొడిగించాలని ప్రధానిని కోరానన్నారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ బాగా ఉపయోగపడిందన్నారు. కరోనా సమర్థ నియంత్రణకు లాక్ డౌన్ ను కనీసం రెండు వారాలపాటు అంటే ఏప్రిల్-30 వరకు కొనసాగించడం మంచిదని తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇంతకు మించిన మార్గం లేదన్నారు. కరోనాపై యుద్ధంలో భారత్ తప్పక గెలిచి తీరుతుందని.. కరోనాపై పోరాటానికి రాష్ట్రాలకు కేంద్రం నుంచి కావాల్సిన మద్దతు లభిస్తోందన్నారు సీఎం కేసీఆర్.
