అప్పుకోసం ఇతర వర్గాలు దళితుల దగ్గరకే రావాలి

అప్పుకోసం ఇతర వర్గాలు  దళితుల దగ్గరకే రావాలి

తెలంగాణ దళిత బంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో వారికిష్టమైన పరిశ్రమను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని, తెలంగాణ దళిత సమాజం వ్యాపారవర్గంగా అభివృద్ది చెందాలన్నారు సీఎం కేసీఆర్. గ్రామాల్లోని ఇతర వర్గాలు దళితుల దగ్గరకే.. అప్పుకోసం వచ్చే దిశగా దళితుల ఆర్థిక సాధికారత సాధించాలన్నారు. అంబేద్కర్ ఆశయాలను అమలులోకి తెచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని.. దళితాభివృద్ధి కోసం చేస్తున్న చారిత్రక కృషిలో విద్యావంతులైన దళిత సమాజం కదలిరావాలన్నారు సిఎం. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న తెలంగాణ దళిత బంధు పథకాన్ని విజయవంతం చేయడం కోసం సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు పనిచేయాలన్నారు. దళితులను ఆర్థిక వివక్ష నుంచే కాకుండా సామాజిక వివక్షనుంచి దూరంచేసి వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు సిఎం. 

దళిత బంధు పథక లబ్ధిదారులకు, 'దళిత బీమా' ను కూడా వర్తింపచేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు కేసీఆర్. రైతు బీమా మాదిరి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి దళిత బీమాను అమలు చేద్దామన్నారు. మంత్రి సహా, దళిత ప్రజా ప్రతినిధులు, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులు, ఈ దిశగా కార్యాచరణ పై కసరత్తు చేయాలన్నారు. ఆమోదయోగ్యమైన కార్యాచరణను రూపొందించుకొని, కొంచెం ఆలస్యమైనా, దళిత బీమాను అమలు చేసుకుందామన్నారు.

తెలంగాణ దళిత బంధు కేవలం కార్యక్రమం కాదు.. ఉద్యమం అన్నారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు సాధించే విజయం మీద యావత్ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి ఉంటుందన్నారు. మనలో పరస్పర విశ్వాసం... సహకారం పెరగాలన్నారు. కక్ష, ద్వేషాలు మానాలని సూచించారు. దళిత బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే... దళితుల అభివృద్ధితో పాటు... తెలంగాణ ఆర్ధికాభివృద్ధికి దారులు పడతాయన్నారు. ఎరువుల దుకాణాలు, మెడికల్ షాపులు, రైస్ మిల్లులు, వైన్స్ షాపులు ఆర్ధిక అభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు సర్కార్ రిజర్వేషన్లు కల్పిస్తుందన్నారు సీఎం.