
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. రాజ్యాంగబద్ధ సంస్థల్ని జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మాట్లాడితే ఏక్ నాథ్ షిండేలను సృష్టిస్తామని కేసీఆర్ మండిపడ్డారు. డ్యాన్స్ లు చేసినా పన్నులు వేస్తామంటున్నా కేంద్ర ప్రభుత్వానికి ప్రజలంటే ఎందుకింత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఆలోచనా విధానంలో మార్పు రావాలని సూచించారు. ఏ దేశంలో అయినా జాతి పితను అవమానించుకుంటారా అని నిలదీశారు.
దందాగా మారిన ఎన్పీఏ
ఉచితాలు బంద్ చేయాలని కొత్త పాట మొదలు పెట్టారని, అసలు ఉచితాలు అంటే ఏంటో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు ఇస్తే వాటిని ఉచితాలు అంటారా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఉచితాలు వద్దంటున్న మోడీ సర్కారు ఎన్పీఏలు ఎందుకు ఇస్తోందని నిలదీశారు.ఎన్పీఏలు ప్రస్తుతం 20 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. ఎన్పీఏలు ఇవ్వడం దందాగా మారిందని విమర్శించారు. మేకిన్ ఇండియాతో దిగుమతులు తగ్గాల్సింది పోయి పెరిగాయని అన్నారు. భారత్ లో 50శాతం భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. అయితే ఇప్పటికీ కందిపప్పు, పామాయిల్ ను దిగుమతి చేసుకోవడం మోడీ సర్కారు గొప్పతనమా అని అన్నారు. లక్షల కోట్లు విత్ డ్రా చేసుకుని విదేశాలకు పారిపోతున్నారని మండిపడ్డారు. విదేశీ మారక నిల్వలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయని పరిస్థితి ఇలాగే కొనసాగితే శ్రీలంక, పాకిస్థాన్ లాంటి పరిస్థితి దాపురిస్తదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని అన్నారు.
మోడీతో శతృత్వం లేదు
కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక ప్రగతిని నాశనం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. బలమైన రాష్ట్రాలతోనే పటిష్ఠమైన దేశం సాధ్యమవుతుందని చెప్పారు. FRBM కోతలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ తనకు మంచి మిత్రుడన్న కేసీఆర్.. ఆయనతో ఎలాంటి వ్యక్తిగత శతృత్వంలేదని స్పష్టం చేశారు. కేంద్రం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని, దేశ భవిష్యత్ కోసం సంఘర్షణ తప్పదని అన్నారు.