
జీఎస్టీ పరిహారం మొత్తం చెల్లించాలి
ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లెటర్
కేంద్రమే అప్పు తీసుకొని రాష్ట్రాలకియ్యాలి
ఆత్మ నిర్భర్ భారత్‌తో లాభమేం లేదు
అప్పులు తీసుకోవడానికే పనికొస్తదన్న సీఎం
హైదరాబాద్, వెలుగు: ‘ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలని కేంద్రం సూచించడం సరికాదు. కరోనా వల్ల నష్టపోయిన ఎకానమీని రివైవ్ చేయడానికి కేంద్రమే అప్పు తీసుకొని రాష్ట్రాలకు ఇవ్వాలి. జీఎస్టీ పరిహారాన్ని ఎలాంటి కోతల్లేకుండా పూర్తిగా చెల్లించాలి. మామూలు టైమ్‌లో పన్నుల రూపంలో ఎంత ఆదాయం వచ్చేదో అంత మొత్తాన్ని అప్పుగా తీసుకొని ఇవ్వాలి’ అని కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్రాలకు పరిహారం చెల్లించకుండా జీఎస్టీ చట్టాన్ని కేంద్రం అతిక్రమిస్తోందన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం లేఖ రాశారు. ఆత్మ నిర్భర్ భారత్‌తో రాష్ట్రాలకు పెద్దగా ప్రయోజనం లేదని, కరోనా వల్ల రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయాన్ని అప్పుల రూపంలో సమకూర్చుకోవడానికే సరిపోతుందని తెలిపారు. దేశ అభివృద్ధి కోసం జీఎస్టీకి తమ సర్కారు మద్దతిచ్చిందని సీఎం గుర్తు చేశారు. జీఎస్టీతో మున్ముందు ప్రయోజనాలు ఉంటాయని, భవిష్యత్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతాయని ఆశించామన్నారు.
ఏప్రిల్‌లో 83% ఇన్‌కమ్ పోయింది
ఈ యేడాది ఏప్రిల్ నుంచి జీఎస్టీ పరిహారం చెల్లించలేదని, ఇలా కాకుండా రెండు నెలలకోసారి ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం కోరారు. లాక్‌డౌన్ వల్ల ఏప్రిల్‌లో తమ ప్రభుత్వం 83 శాతం ఆదాయం కోల్పోయిందని, దీంతో సర్కారు నిర్వహణ భారమైందని చెప్పారు. కరోనా వల్ల పోయిన ఆదాయాన్ని పూడ్చుకోవడానికి వివిధ సంస్థల నుంచి అప్పులు తెచ్చామని.. ఓవర్ డ్రాఫ్టులు, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్‌లు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ద్రవ్య నిర్వహణ కేంద్రం చేతిలో ఉండటంతో రాష్ట్రాలు కేంద్రంపైనే ఆధారపడాల్సి వస్తోందన్నారు. వేరే ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చుకోవాడనికీ కేంద్రం అనుమతి తప్పనిసరి అవుతోందని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. జీఎస్టీ పరిహారాన్ని 10 శాతానికి కుదించాలని కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, దాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.
జీఎస్టీకి రాష్ట్రాల నుంచే 47%
జీఎస్టీకి రాష్ట్రాల నుంచే 47% పన్ను వస్తోందని సీఎం చెప్పారు. జీఎస్టీతో పాటు ఇన్‌కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఆర్బీఐ డివిడెంట్ల రూపంలో అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఎక్కువ ఆదాయ వనరులున్న కేంద్రమే రాష్ట్రాలకు సాయం చేయగలదని చెప్పారు. జీఎస్టీ ప్రవేశపెట్టాక రాష్ట్రానికి సర్ చార్జీలు, సెస్‌ల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోయిందన్నారు. పెట్రో ఉత్పత్తులపై సెస్‌ను లీటర్‌కు రూ.13 పెంచడంతో కేంద్రానికి యేటా రూ. 2 లక్షల కోట్ల అదనపు ఆదాయం వస్తోందన్నారు. పెట్రో ఉత్పత్తులపై సెస్ పెంచడంతో రాష్ట్రాలు వ్యాట్ పెంచే అవకాశాన్ని కోల్పోయాయని చెప్పారు. ఇప్పటివరకు కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు ఉమ్మడిగా తీసుకున్నవని, ఇకపైనా అదే సంప్రదాయం కొనసాగించాలని సూచించారు.
For More News..
లడఖ్‌లో మళ్లీ టెన్షన్.. మూడు రోజుల్లో మూడోసారి..
6 వేల కోట్ల ఇన్‌కం టార్గెట్ పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం