టిప్పర్ అతి వేగమే కారణం: చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై TGSRTC వివరణ

టిప్పర్ అతి వేగమే కారణం: చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై TGSRTC వివరణ

హైదరాబాద్: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ & వీసీ నాగి రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తు తేలిందని వెల్లడించారు. రోడ్డు మలుపులో అతివేగం వల్ల టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తెలిపారు. 

ప్రమాదానికి ఆర్టీసీ బస్సు గానీ, డ్రైవర్ గానీ కారణం కాదని వివరణ ఇచ్చారు. బస్సు డ్రైవర్ సర్వీస్ రికార్డులోనూ గతంలో యాక్సిడెంట్లు లేనట్లు తేలిందని చెప్పారు. ఈ సంఘటన దురదృష్టకరమైనదని.. ప్రాణాలు కోల్పోయిన 19 మందికి సంతాపం తెలియజేస్తున్నామన్నారు. క్షతగాత్రులైన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

చనిపోయిన 19 మందిలో 5 గురు మహిళలు, 14 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి ప్రభుత్వం తరుఫున రూ.5లక్షలు, టీజీఎస్‎ఆర్టీసీ నుంచి రూ.2లక్షల ఎక్స్‎గ్రేషియా ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి ప్రభుత్వం రూ.2 లక్షల పరిహారం ప్రకటించిందని తెలిపారు. 

కాగా, వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు దగ్గర సోమవారం (నవంబర్ 3) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.  రాంగ్ రూట్లో అతి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టిప్పర్ డ్రైవర్, ఆర్టీసీ బస్సు డ్రైవర్.. ఇద్దరూ మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు.