ఇంత చేస్తున్నం..ఫాయిదా ఉందా?

ఇంత చేస్తున్నం..ఫాయిదా ఉందా?
  • దళితబంధుపై ప్రజల రియాక్షన్‌‌ ఎట్లున్నది
  • మంత్రులు, టీఆర్ఎస్ ఇన్‌‌చార్జ్‌‌లను ఆరా తీసిన కేసీఆర్‌‌
  • నా పర్యటన తర్వాత  హుజూరాబాద్‌‌లో పరిస్థితి మారిందా?
  • బైపోల్‌‌లో వ్యూహాలపై సీఎం చర్చ
  • ప్రతి బూత్‌‌లో ఆధిక్యం సాధించాలని ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: హుజూరాబాద్‌‌ ఉప ఎన్నికలో గెలిచేందుకు ఎన్నో చేస్తున్నామని.. పార్టీకి ఫాయిదా ఏమన్న ఉన్నదా అని మంత్రులు, టీఆర్ఎస్ ఇన్‌‌చార్జ్‌‌లను సీఎం కేసీఆర్‌‌ ఆరా తీశారు. దళితబంధు పథకం అమలుపై ప్రజల రియాక్షన్‌‌ ఎలా ఉంది? నియోజకవర్గంలో తన పర్యటన తర్వాత ప్రజల నుంచి ఎలాంటి ఫీడ్‌‌ బ్యాక్‌‌ వచ్చింది? అని అడిగి తెలుసుకున్నారు. ఉప ఎన్నిక ఆలస్యమవడం టీఆర్‌‌ఎస్‌‌కే లాభం చేకూర్చుతుందని, ఆలోగా నియోజకవర్గంలోని ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హుజూరాబాద్‌‌ బైపోల్‌‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రత్యర్థిని దెబ్బకొట్టేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ఇతర అంశాలపై శుక్రవారం ప్రగతి భవన్‌‌లో సీఎం చర్చించారు. హుజూరాబాద్‌‌లో పార్టీ బలం, బలహీనతల గురించి అడిగి తెలుసుకున్నారు.
పరిస్థితి ఎట్లుంది?
హుజూరాబాద్‌‌, జమ్మికుంట మున్సిపాలిటీలు, నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందని మంత్రులు, నేతలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. 
బీసీల నుంచి ఆయా కులాల బంధు కావాలనే డిమాండ్లు స్వచ్ఛందంగా వస్తున్నాయా? లేక వాటి వెనుక ఎవరైనా ఉన్నారా? ఆయా వర్గాలకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అందిన లబ్ధి గురించి చెప్పండి. దళితుల్లో వెనుకబాటు ఉండటం వల్లే కొత్త స్కీం తెస్తున్నామనే విషయం స్వయంగా ఇండ్లకు వెళ్లి వివరించండి.

నియోజకవర్గంలో అన్ని పనులను చేస్తున్నామని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర పనులు శాంక్షన్‌‌‌‌ చేస్తున్నామని, ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారని అడిగారు. గ్రామాలు, వార్డుల వారీగా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఇప్పటికే రెండు, మూడు సార్లు పార్టీ నేతలు కలిశారని, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు అండగా నిలవాలని కోరారని మంత్రులు వివరించారు. తాము వెళ్లినపుడు టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కే మద్దతు అంటున్నారని, కానీ తర్వాత కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారు పార్టీకి ఓటు వేసేలా ప్రయత్నిస్తున్నామని వివరించారు.
బీసీ బంధు డిమాండ్లు 
ఎక్కడ్నుంచి వస్తున్నయ్?
దళితబంధు పథకం హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గంలోని ఎస్సీలందరికీ ఇస్తామని చెప్పిన తర్వాత.. ఆ వర్గంలో పార్టీపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోందని కేసీఆర్‌‌‌‌ ఆరా తీశారు. ‘‘మెజార్టీ ఓటర్లుగా ఉన్న బీసీల నుంచి ఆయా కులాల బంధు కావాలనే డిమాండ్లు స్వచ్ఛందంగా వస్తున్నాయా? లేక వాటి వెనుక ఎవరైనా ఉన్నారా? ఆయా వర్గాలకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అందిన లబ్ధి గురించి చెప్పండి. దళితుల్లో వెనుకబాటు ఉండటం వల్లే కొత్త స్కీం తెస్తున్నామనే విషయం స్వయంగా ఇండ్లకు వెళ్లి వివరించండి. ప్రతి ఓటరును వీలైనన్ని ఎక్కువ సార్లు కలిసి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కే ఓటు వేసేలా వారిలో మార్పు తీసుకురండి” అని కేసీఆర్ ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇన్ని నెలలు గడిచినా ఆయనపై సానుభూతి ఉండటానికి కారణాలు ఏమిటో ఆరా తీయాలన్నారు. ప్రతి బూత్‌‌‌‌లో పార్టీ ఆధిక్యం సాధించేలా ఇప్పటి నుంచే పని చేయాలని సీఎం ఆదేశించినట్టుగా తెలిసింది.
బీజేపీ లీడర్లను పార్టీలోకి తీసుకురండి
దేశంలోని పరిస్థితుల దృష్ట్యా హుజూరాబాద్‌‌‌‌ బైపోల్‌‌‌‌ లేటయ్యే అవకాశముందని, అదే జరిగితే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కే లాభమని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. ఉపాధి హామీ ఫీల్డ్‌‌‌‌ అసిస్టెంట్లు, నిరుద్యోగులు పోటీకి దిగితే ఆ ప్రభావం టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌పై ఉంటుందా అని ఆరా తీశారు. బీజేపీ వైపు ఇంకా కొందరు ముఖ్య నేతలు ఉన్నారని తెలుస్తోందని, వాళ్లను పార్టీలోకి తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. ఎవరైనా బలమైన నేతలు ఉంటే రాష్ట్ర స్థాయిలో పదవులు ఇస్తామని హామీ ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం. కాంగ్రెస్‌‌‌‌ నుంచి అభ్యర్థిగా ఎవరు ఉండొచ్చు? ఎవరు ఉంటే ఆ ప్రభావం టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ఎంతమేరకు లాభం చేకూరుస్తుందని అని అడిగినట్టుగా తెలిసింది. ‘‘ఈటలకు వస్తున్న సానుభూతిని చూసి హైరానా చెందాల్సిన అవసరం లేదు. అన్ని సర్వేల్లోనూ టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కే అనుకూల వాతావరణం కనిపిస్తోంది. గెల్లు శ్రీనివాస్‌‌‌‌ ఉద్యమ నేపథ్యాన్ని, అతడిపై నమోదైన కేసులను చూపుతూ ప్రచారం చేయండి. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు దూరంగా ఉన్న కులాలను గుర్తించి పార్టీ వైపుకు తిప్పుకోవాలి. మహిళల మద్దతు కూడగట్టాలి” అని ఆదేశించినట్టుగా తెలిసింది. ఎన్నికల షెడ్యూల్‌‌‌‌ వచ్చిన తర్వాత తాను మళ్లీ సెగ్మెంట్‌కు ప్రచారానికి వస్తానని చెప్పినట్టు సమాచారం.