మంచిర్యాలలో ఉద్రిక్తత టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ

మంచిర్యాలలో ఉద్రిక్తత టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ

మంచిర్యాల పట్ణణం ఐబీ చౌరస్తాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ జెండాలను ఎందుకు తీసేశారంటూ టీఆర్ఎస్ నేతలను బీజేపీ శ్రేణులు నిలదీశారు. తాము శాంతియుతంగా మౌనదీక్ష చేస్తుంటే.. కావాలనే వాళ్లు రెచ్చగొట్టారని బీజేపీ నేతలు వెల్లడించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలతో దాడి చేయడంతో ఇద్దరు మహిళలు, ముగ్గురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి బీజేపీ శ్రేణులపై మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు కొడుకు విజిత్ రావు దాడి చేశారని.. స్పాట్ లో ఎమ్మెల్యే పాల్గొని టీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టారని ఆరోపించారు. 

అసలేం జరిగింది ? 
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. వరదలు పోటెత్తడంతో మంచిర్యాల, పెద్దపల్లిలోని పలు కాలనీలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. ముంపు బాధిత గ్రామాలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ భద్రచలానికి వెళ్లారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంతాలకు రావాలని, వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఐబీ చౌరస్తాలో శాంతియుతంగా మౌన దీక్ష చేపట్టింది. బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. దీనికి ప్రతిగా పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. టీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. 

దాడులను ఖండించిన వివేక్ వెంకటస్వామి : -
రాస్తారోకో అనంతరం బీజేపీ జెండాలను తీసుకెళ్లి...దున్నపోతులకు కట్టే ప్రయత్నం చేయడంతో బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండాలను ఎందుకు తొలగించారంటూ టీఆర్ఎస్ వర్గీయులను ప్రశ్నించారు. ఇది కాస్తా వాగ్వాదం, తోపులాటకు దారి తీసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఉద్రిక్తత కొనసాగింది. కర్రలు, చెప్పులు విసరడంతో కొంతమందికి స్వల్పగాయాలయ్యాయి. ఎమ్మెల్యే దివాకర్ రావు కొడుకు విజిత్ రావు కూడా అక్కడనే ఉన్నారని, కార్యకర్తలను శాంతపర్చాల్సింది పోయి దాడి చేసే ప్రయత్నం చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతల దాడిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఖండించారు. సేవ్ డెమోక్రసీ పేరిట ఉన్న వినతిపత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి సమర్పించారు.