దేశాన్ని జలగలా పట్టి పీడిస్తున్న బీజేపీ

దేశాన్ని జలగలా పట్టి పీడిస్తున్న బీజేపీ

బీజేపీ దేశాన్ని జలగలా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ అసమర్థ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మోడీ హయాంలో రూపాయి విలువ భారీగా పతనమవడంతోపాటు నిరుద్యోగం పెరిగిపోయిందని కేసీఆర్ మండిపడ్డారు. ప్రధాని తన తెలివితక్కువ తనంతో దేశాన్ని నాశనం పట్టించారని విమర్శించారు.

సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లేని సమావేశాలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ ఏదో చెబుతాడని ఆశిస్తే అలాంటిదేం జరగలేదని కేసీఆర్ అన్నారు. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లేని ఆ సమావేశాల్లో ప్రధాని చెప్పింది సున్నా అని విమర్శించారు. సభలో ప్రధాని ఏం మాట్లాడిండో దేవుడికే ఎరుకన్న కేసీఆర్.. తాను అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ప్రధాని సమాధానం చెప్పలేదని అన్నారు. కేంద్ర మంత్రులు సైతం నోటి దూల తీర్చుకుని పోయారే తప్ప దేశ ప్రజల పక్షాన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని డొల్లతనాన్ని రుజువు చేసుకుని పోయారని చెప్పారు. బీజేపీ సమావేశాల ద్వారా బీజేపీ, ప్రధాని మోడీకి దేశ ప్రగతిపై దృక్పథం, అవగాహన, వ్యూహం లేవని నిరూపించుకున్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 

8ఏండ్లలో దేశానికి చేసిందేం లేదు

కేంద్రంలో అధికారంలోకి వచ్చి 8ఏండ్లు గడుస్తున్నా మోడీ దేశానికి చేసిన ఒక్క మంచిపనైనా ఉందా అని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం రూపాయి మారకం విలువ రూ.80కు పడిపోయిందని వాపోయారు. ఇది ప్రధాని అవివేకమా లేక చేతగానితనమో ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రూపాయి ఎందుకు పతనమవుతోందని అడిగిన మోడీ ఇప్పుడేం సమాధానం చెప్తారని నిలదీశారు. మోడీ అసమర్థ పాలన వల్ల ఏ ఒక్క రంగం కూడా బాగుపడలేదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో కరెంటు కష్టాలు లేకుండా చేసి, సాగు నీరు ఇవ్వడం కూడా మోడీ ప్రభుత్వానికి చేతకాదని విమర్శించారు.

కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నరు

బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో కన్నా కేరళ, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని కేసీఆర్ చెప్పారు. అందుకే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు పోయి బీజేపీయేతర ప్రభుత్వాలు రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మార్చుతామని అన్నారు.  బీజేపీ నేతలకు కళ్లు నెత్తికెక్కాయని, దద్దమ్మలు కూడా ఎక్కువ మాట్లాడుతున్నరని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో ఏక్ నాథ్ లు ఎట్లా వస్తారన్న ముఖ్యమంత్రి.. బీజేపీ ఏక్ నాథ్ లను తయారు చేస్తోందా అని నిలదీశారు. బీజేపీ తప్పులు శిశుపాలనుడిని మించిపోతున్నాయన్న కేసీఆర్..  ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటిస్తే.. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ నెలకొందని అన్నారు.