ఈ ఏడాది బడి: ఇప్పటికీ రివ్యూ మీటింగ్ పెట్టని సీఎం కేసీఆర్

ఈ ఏడాది బడి: ఇప్పటికీ రివ్యూ మీటింగ్ పెట్టని సీఎం కేసీఆర్

డిజిటల్ క్లాసులు నడుస్తున్నా పెద్దగా ఉపయోగం లేదు​..
కనీసం 9,10 క్లాసుల కోసమైనా బడులు తెరవాలంటున్న టీచర్లు

హైదరాబాద్, వెలుగు: ఈ అకడమిక్​ ఇయర్​లో స్కూళ్లు తెరుస్తారా? అన్న దానిపై రాష్ట్ర సర్కార్​ నుంచి స్పందన లేదు. కనీసం తొమ్మిది, పదో తరగతుల స్టూడెంట్స్ కోసమైనా ఓపెన్​ చేస్తారని ఇన్నాళ్లు అనుకుంటున్నా అదీ కనిపించడం లేదు.  నెలరోజుల కింద ఆఫీసర్లతో విద్యాశాఖ మంత్రి రివ్యూ చేసి.. సీఎం పరిశీలనకు ప్రతిపాదనలు పంపారు.  దానిపై ఇప్పటికీ సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా ఎఫెక్ట్​తో మార్చి16 నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం హాలిడే ప్రకటించింది. వాస్తవానికి జూన్ 12 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా కేసులు తగ్గకపోవడంతో ఇప్పటికీ స్కూళ్లు రీఓపెన్ కాలేదు. దాదాపు రాష్ట్రంలో బడులు మూతపడి దాదాపు 9 నెలలు కావొస్తోంది. స్టేట్​లో మొత్తం 40,597 స్కూళ్లుండగా.. వాటిల్లో 58 లక్షల మంది స్టూడెంట్స్​ఉన్నారు. వీటిలో 26 వేల సర్కారు స్కూళ్లలో 22లక్షల మంది చదువుతుండగా, 31లక్షల మంది ప్రైవేటు బడుల్లో, మిగిలిన వారంతా గురుకులాలు, సెంట్రల్ గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్నారు. అయితే ఈ స్టూడెంట్లంతా అకడమిక్ ఇయర్ నష్టపోవద్దనే భావనతో, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ పాఠాలను విద్యాశాఖ ప్రారంభించింది. దూరదర్శన్ యాదగిరి, టీశాట్, నిపుణ చానళ్ల ద్వారా మూడో తరగతి నుంచి పదో తరగతి వరకూ క్లాసులు నిర్వహిస్తున్నారు. రోజూ 80 శాతం నుంచి 95 శాతం వరకూ స్టూడెంట్స్ పాఠాలు వింటున్నారని ఆఫీసర్లు లెక్కలు చెప్తుండగా, వాటిలో సగం మంది స్టూడెంట్స్ కూడా డిజిటల్ పాఠాలు వినడం లేదనే వాదనలున్నాయి. ఏమైనా డౌట్స్ వచ్చినా ఎవ్వరూ క్లారిఫై చేయడం లేదు. 9,10 తరగతుల స్టూడెంట్స్​ ఏమైనా డౌట్స్​ఉంటే.. పేరెంట్స్ అనుమతితో స్కూల్​కు వెళ్లి క్లారిఫై చేసుకోవచ్చని కేంద్రం సూచనలు ఇచ్చినా రాష్ట్రంలో అమలు కావడం లేదు.

ప్రైవేటులో సగం బడుల్లోనే ఆన్​లైన్ క్లాసులు

రాష్ట్రంలో 10,549 ప్రైవేటు స్కూళ్లుండగా, వాటిలో దాదాపు సగం స్కూళ్లలోనే ఆన్​లైన్ క్లాసులు నడుస్తున్నాయి. దీంతో సుమారు 15 లక్షల మంది స్టూడెంట్స్ ఇప్పటికీ క్లాసులకు దూరంగానే ఉన్నారు. చాలా ప్రైవేటు స్కూళ్లలో కేవలం 9, 10 క్లాసులకే ఆన్​లైన్ టీచింగ్ కొనసాగుతున్నది. మిగిలిన క్లాసులకు పాఠాలు చెప్పడం లేదు. ఆన్​లైన్ పాఠాలు విన్నవారూ ఈ క్లాసులు అర్థం కావడం లేదని చెబుతున్నారు. దీంతో పేరెంట్స్, స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు.

అభిప్రాయాలు తీసుకున్నారు కానీ..

అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 220 రోజులు పనిదినాలుండాలి. డిజిటల్ పాఠాలు ప్రారంభమై మూడున్నర నెలలు కావొస్తున్నది. కానీ రోజులో కేవలం ఒక్కో తరగతికి అన్ని క్లాసులు చెప్పడం లేదు. రెండు, మూడు పిరియడ్లు మాత్రమే చెప్పిస్తున్నారు. దీంతో ఇప్పటికీ 30% పాఠాలైనా పూర్తికాలేదని టీచర్లు చెప్తున్నారు. అయితే అకడమిక్​ ఇయర్​ ప్రారంభంపై నెలరోజుల కింద విద్యాశాఖ ఆఫీసర్లతో  మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. అందరి అభిప్రాయాలు సేకరించారు. ఈ మినిట్స్​ను సీఎం కేసీఆర్​కు పంపించారు. అయితే ఇప్పటికీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. దీంతో ఈ విద్యాసంవత్సరం ఉంటుందా..? లేక జీరో ఇయర్ చేస్తారా అనే ఆందోళన పేరెంట్స్​లో మొదలైంది. మరోపక్క కార్పొరేట్, ప్రైవేటు బడుల్లో పేరెంట్స్ నెలనెలా ఫీజులు చెల్లిస్తున్నారు. జీరో ఇయర్ చేస్తే, ఈ డబ్బుల ఖర్చు వృథా అవుతుందని ఆందోళన చెందుతున్నారు. బడుల ప్రారంభంపై ఏ ఆఫీసర్​ను అడిగినా సీఎం నిర్ణయమే ఫైనల్ అని చెప్తున్నారు. అయితే బడులు తెరవాలని సీఎంకు చెప్పే సాహసం  ఏ ఆఫీసర్​ కూడా చేయడం లేదు. బడులు తెరిచాక ఎవరికైనా  కరోనా వస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని సర్కారు పెద్దలు భావిస్తున్నారు.

హైస్కూల్స్​ క్లాసులైనా స్టార్ట్  చేస్తరా?

పక్కనున్న ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో హైస్కూళ్లు తెరిచి, క్లాసులు ప్రారంభించారు. కానీ తెలంగాణలో ఇప్పటికీ అసలు ప్రారంభిస్తారా లేదా అనే అంశంపై కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. టీచర్లూ రోజు విడిచి రోజు బడులకు పోతున్నారు. కనీసం 9,10 క్లాసులనైనా ప్రారంభించాలని టీచర్స్ యూనియన్లు కోరుతున్నాయి. ఇప్పటికైనా సీఎం కేసీఆర్​ రివ్యూ మీటింగ్ పెట్టి, ఓ నిర్ణయం ప్రకటించాలని పేరెంట్స్ కోరుతున్నారు.

దశల వారీగా స్టార్ట్ చేయాలి

స్టూడెంట్లు అకడమిక్​ ఇయర్​ నష్టపోకుండా ప్రభుత్వం వెంటనే బడులు తెరిచేందుకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో అన్ని కార్యకలాపాలు, ఆఫీసులు తెరిచేందుకు అడ్డురాని కరోనా సమస్య.. స్కూళ్లను స్టార్ట్ చేసేందుకు మాత్రం వస్తుందా?  కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ దశలవారీగా బడులను ప్రారంభించాలి. అవసరమైతే కొన్ని రోజులు ఆల్టర్నేట్ డేస్ క్లాసులు కొనసాగించాలి. – చావ రవి, యూటీఎఫ్​ స్టేట్ జనరల్ సెక్రెటరీ

స్కూళ్ల నిర్వహణకు సిద్ధమే

స్కూళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తే, ఆ బడుల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. కనీసం 9, 10 తరగతులకైనా ఫిజికల్ క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వ పెద్దలకు, ఆఫీసర్లకు విన్నవించాం. బడులను ఓపెన్ చేయకుంటే సర్కారు స్కూళ్లలో చదివే వారే నష్టపోతారు.

– రాజభాను చంద్రప్రకాశ్, హెడ్​మాస్టర్స్​  అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్