హిందువుల గురించి ఆలోచించే వ్యక్తి కేసీఆర్ ఒక్కరే : హరీష్ రావు

 హిందువుల గురించి ఆలోచించే వ్యక్తి కేసీఆర్ ఒక్కరే : హరీష్ రావు

దేశంలో హిందువుల గురించి అలోచించే వ్యక్తి సీఎం కేసీఆర్ ఒక్కరేనని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో  దేవాలయాల నిధులను ప్రభుత్వాలు వాడుకునేవని, కేసీఆర్ సర్కారు మాత్రం ప్రభుత్వ నిధులను దేవాలయాలకు ఇస్తోందని చెప్పారు. హైదరాబాద్ బొగ్గులకుంటలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో వివేకానంద విదేశీ విద్యా పథకం కింద ఎంపికైన విద్యార్థులకు మంత్రి హరీష్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. 121 మంది బ్రాహ్మణ విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు ఒక్కొక్కరికి రూ. 20లక్షల చొప్పున మంజూరు అయ్యాయని చెప్పారు.

హిందూ ధర్మ పరిరక్షకులుగా ఉన్న బ్రాహ్మణులలో పేదలకు సాయం చేయాలనేది సీఎం కేసీఆర్ ఉద్దేశమని హరీష్ రావు అన్నారు. బ్రాహ్మణ సమాజ కోసం కేసీఆర్ తొలి సామూహిక భవనాన్ని సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దూపదీప నైవేద్యాన్ని రూ.6వేలకు పెంచిన కేసీఆర్ బ్రాహ్మణ బంధువని కొనియాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బ్రాహ్మణులకు ఎందుకు సాయం చేయటం లేదని హరీష్ రావు ప్రశ్నించారు.