జాతీయ పార్టీ ప్రకటించనున్న కేసీఆర్

జాతీయ పార్టీ ప్రకటించనున్న కేసీఆర్
  • టీఆర్‌‌ఎస్‌‌ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్‌‌ను ప్రకటించనున్న సీఎం
  • హైదరాబాద్‌‌కు చేరుకున్న కుమార స్వామి, రేవన్న, తిరుమావళవన్‌‌
  • ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి ప్రగతి భవన్‌‌లో లంచ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. టీఆర్‌‌ఎస్‌‌ను బీఆర్‌‌ఎస్‌‌గా మార్చుతూ తీర్మానం చేయనున్నారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి సహా పలు ప్రాంతీయ పార్టీల నేతల సమక్షంలో జాతీయ పార్టీ ఏర్పాటు గురించి కేసీఆర్ వెల్లడించనున్నారు. తెలంగాణ భవన్‌‌లో జరిగే టీఆర్‌‌ఎస్‌‌ విస్తృత స్థాయి సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొనేందుకు ప్రాంతీయ పార్టీల నేతలు, రైతు సంఘాలు, ట్రేడ్‌‌ యూనియన్ల ప్రతినిధులు సుమారు 40 మంది మంగళవారమే హైదరాబాద్‌‌కు చేరుకున్నారు. ఈ కార్యక్రమం కోసం తెలంగాణ భవన్‌‌ను తీర్చిదిద్దారు. హైదరాబాద్‌‌ను గులాబీ ఫ్లెక్సీలతో నింపేశారు. బుధవారం ఉదయం టీఆర్‌‌ఎస్‌‌ చీఫ్‌‌ కేసీఆర్‌‌ అధ్యక్షతన పార్టీ జనరల్‌‌ బాడీ సమావేశం ప్రారంభం కానుంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పరిషత్‌‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌‌, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు పాల్గొననున్నారు. జనరల్‌‌ బాడీ సమావేశానికి ఆహ్వానించిన 283 మందితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మందికి ప్రగతి భవన్‌‌లో లంచ్‌‌ ఏర్పాటు చేశారు.

(మొదటిపేజీ తరువాయి)
బుధవారం ఉదయం 11 గంటలకు పార్టీ జనరల్‌‌ బాడీ సమావేశం ప్రారంభమవుతుంది. 2001లో టీఆర్‌‌ఎస్‌‌ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టాలు, నిరాహార దీక్ష, కేంద్ర ప్రభుత్వ ప్రకటన, సీమాంధ్ర నాయకుల కుట్రలతో కేంద్రం వెనక్కి తగ్గడం.. చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ముఖ్య అంశాలపై కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో విదేశాల్లో దేశం ప్రతిష్ట ఎలా మసకబారుతున్నది.. దేశంలోని వనరుల సద్వినియోగంలో దేశాన్ని పాలించిన వాళ్లు ఎలా విఫలమయ్యారు, టీఆర్‌‌ఎస్‌‌ను ఎందుకు బీఆర్‌‌ఎస్‌‌గా మార్చబోతున్నాం.. అనే వాటిపైనా కేసీఆర్‌‌ మాట్లాడుతారు. తర్వాత టీఆర్‌‌ఎస్‌‌ పేరును బీఆర్‌‌ఎస్‌‌గా మార్చుతూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెడుతారు. దానికి సభ్యులు ఆమోదం తెలిపాక.. సరిగ్గా మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్‌‌ జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారు. తర్వాత ఆహ్వానితులతో పాటు సమావేశంలో పాల్గొన్న నేతలందరినీ తీసుకొని ప్రగతి భవన్‌‌కు వెళ్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. లంచ్‌‌ తర్వాత సాయంత్రం 4 గంటలకు కేసీఆర్‌‌ తిరిగి తెలంగాణ భవన్‌‌కు చేరుకొని బీఆర్‌‌ఎస్‌‌ ఏర్పాటుపై మీడియాతో మాట్లాడుతారని టీఆర్‌‌ఎస్‌‌ ముఖ్య నేతలు చెబుతున్నారు.

స్పెషల్​ ఫ్లైట్​ పంపి కుమారస్వామికి ఆహ్వానం
బెంగళూరుకు స్పెషల్‌‌ ఫ్లైట్‌‌ను పంపి కర్నాటక మాజీ సీఎం కుమారస్వామిని హైదరాబాద్‌‌కు కేసీఆర్ పిలిపించారు. మంగళవారం రాత్రి బేగంపేట ఎయిర్‌‌పోర్టులో కుమారస్వామి, మాజీ మంత్రి రేవన్న, ఇతర నాయకులకు మంత్రి కేటీఆర్‌‌ స్వాగతం పలికారు. తమిళనాడుకు చెందిన దళిత నేత విడుథలై చిరుతైగల్‌‌ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ థోల్‌‌ తిరుమావళవన్‌‌ ప్రతినిధి బృందంతో కలిసి హైదరాబాద్‌‌కు వచ్చారు. ఆయనకు టీఆర్‌‌ఎస్‌‌ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. పలు ప్రాంతీయ పార్టీల నేతలు, రైతు సంఘాలు, ట్రేడ్‌‌ యూనియన్ల ప్రతినిధులు వచ్చారు. 

ఒక్క ఓటూ మిస్‌‌ కావొద్దు
మునుగోడులో ఒక్క ఓటు కూడా మిస్‌‌ కావొద్దని టీఆర్‌‌ఎస్‌‌ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు తేల్చిచెప్పారు. దసరా సందర్భంగా పార్టీ అభ్యర్థిని బుధవారం ప్రకటిస్తానన్నారు. కూసుకుంట్ల అభ్యర్థిత్వం దాదాపుగా ఫైనల్‌‌ చేసినట్టు సంకేతాలు ఇచ్చారు. మంగళవారం ప్రగతి భవన్‌‌లో మునుగోడు బైపోల్​పై కేసీఆర్ రివ్యూ చేశారు. మంత్రులందరూ ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారని, వారితో కో ఆర్డినేట్‌‌ చేసుకుంటూ సభలు ఏర్పాటు చేసుకోవాలని ఇన్‌‌చార్జ్​లకు కేసీఆర్ సూచించారు. ఒకటి, రెండు రోజుల్లో ఎమ్మెల్యేలు వారికి బాధ్యతలు ఇచ్చిన గ్రామాలకు అనుచరులతో కలిసి వస్తారన్నారు. 86 మంది ఎమ్మెల్యేలకు తోడు పార్టీ ముఖ్య నాయకులు మునుగోడు వస్తారని, ప్రతి ఓటు టీఆర్‌‌ఎస్‌‌ కు పడేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పార్టీ పేరు ఏంటి?
టీఆర్‌‌ఎస్‌‌ను బీఆర్‌‌ఎస్‌‌గా మార్చుతారని ముందు నుంచీ చెబుతున్నారు. బీఆర్‌‌ఎస్‌‌ అంటే.. భారత రాష్ట్ర్‌‌ సమితి, భారత రాష్ట్రీయ్‌‌ సమితి, భారత రాష్ట్ర సంఘటన్‌‌ అని వచ్చేలా ఉంటుందని సమాచారం. నయా భారత్‌‌ పార్టీ అనే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు, పార్టీ జిల్లాల అధ్యక్షుల సమావేశంలో బీఆర్‌‌ఎస్‌‌ అనే పేరు ఉంటేనే బాగుంటుందనే సూచనలు వచ్చాయి. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ దీనిపై మరోసారి అభిప్రాయం తీసుకొని బీఆర్‌‌ఎస్‌‌ పేరునే ప్రకటించనున్నట్టు సమాచారం.

రేపు ఢిల్లీకి కేసీఆర్‌‌?
జాతీయ పార్టీ ప్రకటించిన తర్వాత బుధవారం రాత్రి లేదా గురువారం కేసీఆర్‌‌ ఢిల్లీ వెళ్లే చాన్స్​ ఉందని టీఆర్‌‌ఎస్‌‌ ముఖ్య నేతలు చెప్తున్నారు. తమతో కలిసి వచ్చే పలు ప్రాంతీయ పార్టీల నేతలు, వివిధ సంస్థల ప్రతినిధులతో కేసీఆర్‌‌ ఈనెల 9న ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న యూపీ మాజీ సీఎం ములాయం సింగ్​ను కేసీఆర్‌‌ పరామర్శిస్తారని సమాచారం. సోమవారం ములాయం కుమారుడు అఖిలేశ్‌‌కు కేసీఆర్‌‌ ఫోన్‌‌ చేశారు. దసరా తర్వాత స్వయంగా వచ్చి ములాయంను పరామర్శిస్తానని చెప్పారు. ఈక్రమంలోనే ఢిల్లీ పర్యటన ఉంటుందని టీఆర్‌‌ఎస్‌‌ నేతలు చెబుతున్నారు.