శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం

 శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం

ములుగు జిల్లా : రామన్నగూడెం లో ఏటా వరదలు వస్తున్నాయని, వచ్చే ఏడాది వరద సమస్య లేకుండా చూస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. ముంపునకు గురైన ఎస్సీ, ఎస్టీ కాలనీ లను పరిశీలించిన   సీఎం.. శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజలంతా బాగుండాలని కేసీఆర్ ఆకాంక్షించారు.  ఏటూరునాగారం, రామన్నగూడెం పరిధిలోని వరద ముంపు ప్రాంతాలను  పరిశీలించిన  సందర్బంగా ఓ గ్రామంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.   రామన్నగూడెం పుష్కర  ఘాట్ ముంపు పై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కు వివరించారు .  పర్యటనలో భాగంగా కటాక్షాపూర్ చెరువు గురించి సీఎస్ సోమేష్ కుమార్ కు  సీఎం స్వయంగా వివరించారు. 

అంతకుముందు సీఎం కేసీఆర్ ములుగు జిల్లాలోని రామన్న గూడెంలో ఏరియల్ సర్వే చేశారు.  ప్రకృతి విపత్తుతో  ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని సీఎం కేసీఆర్ హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదల్లో చిక్కుకున్న గ్రామాలను చూస్తూ  సీఎం ఏటూరునాగారానికి చేరుకున్నారు.  కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లి ముంపు బాధితులను సీఎం పరామర్శించారు. మారుమూల ప్రాంతాల్లో వరదల పరిస్థితిని అద్దంపట్టే ఫొటోలతో ఏర్పాటుచేసి ఎగ్జిబిషన్ కు కేసీఆర్ తిలకించారు.