భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం మళ్లీ వస్తా

భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం మళ్లీ వస్తా
  • వానల వెనుక విదేశీ కుట్ర
  • గోదావరి ఏరియాలో క్లౌడ్​ బరస్ట్ చేస్తున్నట్లు సమాచారం ఉంది
  • వరదల్లో ప్రాణ నష్టం జరగకుండా అడ్డుకున్నం: సీఎం కేసీఆర్​
  • భద్రాచలం ముంపు ప్రాంతాల తరలింపునకు రూ. వెయ్యి కోట్లు
  • వేరేచోట శాశ్వత ప్రాతిపదికన 2వేల ఇండ్లు కట్టిస్తం
  • దేవుడి దయ వల్ల కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది..  గోదావరికి మళ్లా వరదలు రావొచ్చు
  • గతంలో సరైన ప్లానింగ్​ లేకపోవడమే భద్రాచలం ముంపునకు కారణమని ఆరోపణ
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో  హెలికాప్టర్​లో పర్యటన 
  • గోదావరికి శాంతి పూజలు.. 
  • చీరె, సారె సమర్పణ

భద్రాచలం, వెలుగు:  భారీ వర్షాలు, వరదల వెనుక విదేశీ కుట్ర ఉందని, కొన్ని దేశాలు క్లౌడ్​ బరస్ట్​ చేస్తూ మన దేశంలో భారీ వర్షాలు, వరదలకు కారణమవుతున్నాయని సీఎం కేసీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘క్లౌడ్​ బరస్ట్​ అనేది కొత్త పద్ధతి ఏదో వచ్చింది.. ఏవో కొన్ని కుట్రలు ఉన్నాయని చెప్తున్నరు..ఎంతవరకు కరెక్టో తెలియదు.. ఇతర దేశాలవాళ్లు కావాలనే మన దేశంపై అక్కడక్కడ క్లౌడ్​ బరస్ట్​ చేస్తున్నరు. గతంలో కాశ్మీర్​లోని లడఖ్, లేహ్​ప్రాంతాల్లో చేసిన్రు. తర్వాత ఉత్తరాఖండ్​లో చేసిన్రు.. ఈ మధ్య గోదావరి పరీవాహ ప్రాంతం మీద కూడా చేస్తున్నరని మనకు సమాచారం ఉంది..’’  అని ఆయన అన్నారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం సీఎం కేసీఆర్​ పర్యటించారు. ముంపు బాధితులకు అందుతున్న​సహాయ చర్యలపై భద్రాచలం ఐటీడీఏలో సమీక్ష చేశారు. గోదావరికి అనూహ్యంగా చాలా ఏండ్ల తర్వాత వరదలు వచ్చాయని చెప్పారు. 

 దేవుడి దయవల్ల కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పిందన్నారు. గతంలో ఎక్కువలో ఎక్కువ 2.90 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, కానీ ఈసారి ఒకేసారి 5 లక్షల క్యూసెక్కులు వచ్చినా ప్రాజెక్టు నిలిచిందని పేర్కొన్నారు. ఏపీలో కలిసి ఉన్నప్పటి నుంచే భద్రాచలానికి వరద సమస్య ఉందని, దీనికి ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం కనుగొనాల్సి ఉందన్నారు. 

భద్రాచలంలో వెయ్యి కోట్లతో శాశ్వత పరిష్కారం

గోదావరిలో నీటిమట్టం 50 అడుగులకు చేరినా భద్రాచలంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయని, గతంలో సరైన ప్లానింగ్​లేకపోవడమే ఇందుకు కారణమని సీఎం కేసీఆర్​ఆరోపించారు. సుభాష్​నగర్​, అశోక్​నగర్​ కొత్తకాలనీ, ఏఎంసీ,అయ్యప్ప కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. వరద 90 అడుగులు వచ్చినా ఇబ్బందులు కాకుండా ఎత్తయిన ప్రాంతంలో ముంపు బాధితులకు సింగరేణితో కలిసి 2 వేల ఇండ్లను కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఆ భూమి పూజకు తాను స్వయంగా వస్తానన్నారు. ‘‘భద్రాచలంలో శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరించాలని నిర్ణయించినం.. వరద ముంపు బాధితులకు పర్మినెంట్​ ఇండ్లను కట్టించి ఇస్తం.. భద్రాచలం పట్టణ కాంటూర్​ లెవల్స్​ను పరిగణనలోకి తీసుకుంటం.. కరకట్ట ప్రాంతంలోని నివాసాలను కూడా తరలిస్తం.. ఇందుకు రూ. 1,000 కోట్లు ఖర్చు చేస్తం.. గంగా నది వరదలు, బీహార్​లో వచ్చిన వరదలు ఎలా ఎదుర్కొన్నారో నిపుణుల నుంచి సలహాలు తీసుకుంటం..  సీడబ్ల్యూసీ, ఐఐటీ ప్రొఫెసర్లను రప్పించి శాశ్వతంగా పరిష్కారం చూపుతం’’’ అని కేసీఆర్​ చెప్పారు. లోకల్ మినిస్టర్​ పువ్వాడ అజయ్​కుమార్​, సీఎస్​ సోమేశ్​ కుమార్ ఈ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. సీతమ్మసాగర్​ బ్యారేజ్  వల్ల దుమ్ముగూడెం మండలం పర్ణశాల ఆలయంతో పాటు కొన్ని గ్రామాలు మునుగుతున్నాయని, ఈ వెయ్యికోట్ల ప్రాజెక్టులో భాగంగా అక్కడ కూడా ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా నిరంతరం బ్లీచింగ్​ చేయించాలని హెల్త్ డైరెక్టర్​ శ్రీనివాసరావును ఆదేశించామని చెప్పారు. భద్రాచలం ఏజెన్సీలోని సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పొదెం వీరయ్య తన దృష్టికి తీసుకొచ్చారని వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు. 

భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం మళ్లీ వస్తా

భద్రాచలం ఆలయాన్ని భక్తజనావళి మెచ్చేలా డెవలప్​ చేయాల్సి ఉందని, ఇందుకోసం మరోసారి భద్రాచలం వస్తానని సీఎం కేసీఆర్​ చెప్పారు.  బూర్గంపాడుకు కూడా కరకట్ట విషయంపై పరిశీలిస్తామని, ఐజీ నాగిరెడ్డి, సీనియర్​ ఐఏఎస్​ ఆఫీసర్లు రజత్​కుమార్​షైనీ, హన్మంతరావు, సింగరేణి సీఎండీ శ్రీధర్  వెళ్లి పరిశీలిస్తారని చెప్పారు. భద్రాచలం చుట్టూ కరకట్టల పొడిగింపు విషయంలో పక్క ఆంధ్రా రాష్ట్రంతో కూడా మాట్లాడుతామని, అది పాకిస్తాన్ ప్రభుత్వం కాదు కదా..? అని వ్యాఖ్యానించారు. 

గోదారమ్మకు శాంతి పూజలు

వరంగల్ నుంచి నేరుగా భద్రాచలం వచ్చిన సీఎం కేసీఆర్ గోదావరి కరకట్టపైకి వెళ్లారు. స్లూయిజ్​పై నుంచి గోదారమ్మకు శాంతి పూజలు చేశారు. అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య ఆయన గోదావరికి పసుపు, కుంకుమ, పూలు, పట్టు వస్త్రాలు సమర్పించి నమస్కరించారు. అనంతరం కరకట్టను పరిశీలించారు. టెంపుల్​ ఏరియాలో బ్యాక్​ వాటర్​పై ఆరా తీశారు. అక్కడి నుంచి నన్నపనేని మోహన్​ స్కూల్​, గిరిజన అభ్యుదయ భవన్​లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్ని సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. సర్కారు అండగా నిలుస్తుందని చెప్పారు. శాశ్వత పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలకు సహకరించాలని కోరారు.

పునరావాస సెంటర్​ గేట్లకు తాళాలు

సీఎం కేసీఆర్​ రోడ్డు మార్గంలో అశ్వాపురం మీదుగా భద్రాచలం వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు.. అశ్వాపురంలోని ఎస్​కేటీ ఫంక్షన్​హాల్​లో ఉన్న పునరావాస సెంటర్​ గేట్లకు తాళాలు వేశారు. పునరావాస కేంద్రంలోని వరద బాధితులు సీఎం కాన్వాయ్​ను అడ్డుకుంటారనే అనుమానంతో ఇలా చేశారు. దీంతో బాధితులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గేట్లను పగలగొట్టేందుకు ప్రయత్నించారు. సీఎం కాన్వాయ్​ వెళ్లిన తర్వాత గేట్లు తెరిచారు.

ఆధారాలివ్వు.. దర్యాప్తు చేయిస్తం

క్లౌడ్ బరస్ట్​ వెనుక విదేశీ కుట్రలు ఉన్నాయన్న సీఎం కేసీఆర్​ తన వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ ఆరోపణలు చేయడాన్ని కేంద్రం సీరియస్​గా తీసుకుంటుంది. ఆధారాలు అందజేయాలని కేసీఆర్​కు విజ్ఞప్తి చేస్తున్నా. వాటిని బట్టి సీరియస్​గా దర్యాప్తు చేయిస్తం.

- కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ట్వీట్​
అవినీతి కప్పిపుచ్చుకునేందుకే కొత్త డ్రామా

కాళేశ్వరం అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అని అంటున్నడు.   దానిలో నిజాన్ని తేల్చేందుకు ఆయనను కేంద్రం కస్టడీలోకి తీసుకొని విచారించాలి. కేసీఆర్‌‌‌‌కు ఇంత సమాచారం ఉంటే వరదల నష్టం గురించి ఆలోచించకుండా.. టీఆర్ఎస్‌‌ను జాతీయ పార్టీగా మలుచుకోవడానికి ఎందుకు సమీక్షలు చేస్తూ కూర్చున్నడు. 

- పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి